News

అయోధ్యనగరిలో రామాయణ మైనపు మ్యూజియం

223views

శ్రీరాముడు జన్మించిన అయోధ్యా నగరిలో మరో చారిత్రక మైలురాయి ఆవిష్క్రుతం కాబోతోంది. ఈనగరంలోని చౌరాసి కోసి పరిక్రమ మార్గంలోని కాశీరాం కాలనీకి ఎదురుగా ఉన్న స్థలంలో రామాయణ మైనపు మ్యూజియం తయారైంది. ఒకటి కాదు రెండు కాదు రామాయణంలోని యాభై కీలక పాత్రలను జీవకళ ఉట్టిపడేలా మైనంతో తయారు చేశారు. రాముడి జననం నుండి రావణుడి అంతం వరకు ప్రతీ ముఖ్య ఘట్టాన్ని ఈ మైనపు విగ్రహాలతో చక్కగా ఏర్పరిచారు. వీటితో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రామాయణ మైనపు మ్యూజియంగా అయోధ్యనగరిలో ఏర్పరిచారు. ఈనెల (అక్టోబర్ 19)న దీపోత్సవం సందర్భంగా దీన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు.

కేరళకు చెందిన సునీల్ వ్యాక్స్ మ్యూజియం కంపెనీ దీన్ని నిర్మించింది. గతంలో మహారాష్ట్రలోని లోనావాల, కేరళలోని తిరువనంతపురంలో సెలబ్రిటీల వ్యాక్స్ మ్యూజియం ను నిర్మించింది ఈ సంస్థ . కానీ ఒక ఆధ్యాత్మిక మ్యూజియంను నిర్మించడం ఇదే మొదటిసారి. 9,850 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్ ఏసీ వసతితో రెండు అంతస్తులలో ఈ మ్యూజియం నిర్మించారు. అందుకోసం మొత్తందాదాపుగా ఆరుకోట్లను వెచ్చించారు.

మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో రాముడి బాల్యం నుండి సీతా స్వయంవరకు గల అన్నీముఖ్య ఘట్టాలను చూపిస్తే, మొదటి అంతస్తులో రామయ్య వనవాసం, లంకాదహనం, రామ రావణ యుద్ధం ఇలా అనేక ఘట్టాలను చూపేలా మైనపు విగ్రహాలను తయారుచేశారు. అన్నీ విగ్రహాలను కూడా త్రీడీ లైటింగ్ ఎఫెక్ట్ల లతో అలంకరించారు. దీన్ని చూసిన భక్తులు తప్పకుండా ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ మ్యూజియం చూడాలంటే వందరూపాయల ప్రవేశ రుసుము ఉంటుంది. ఒకేసారి వందమందికి ప్రవేశం ఉంది.