News

పరకామణి కేసులో రికార్డులు స్వాధీనం

195views

తిరుమల పరకామణిలో పనిచేసే ఉద్యోగి రవికుమార్‌ భారీగా విదేశీ డాలర్లు, బంగారాన్ని కాజేశారన్న అభియోగాలపై రెండేళ్ల కిందట నమోదైన కేసులో విచారణను ఏపీ సీఐడీ వేగవంతం చేసింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం తిరుమలలోని వివిధ విభాగాల్లో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించింది. ఈ బృందంలో సీఐడీ న్యాయ సలహాదారు లక్ష్మణ్‌రావు, డీఎస్పీలు కొండయ్య, వేణుగోపాల్, సీఐలు రంగస్వామి, చంద్రశేఖర్, ఎస్సైలు రాజ్‌కుమార్, ధరణీధర్‌లు ఉన్నారు.

డీజీ రవిశంకర్‌ తొలుత పోలీసు అతిథిగృహంలో తితిదే విజిలెన్స్‌ అధికారులతో సమావేశమై కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆయన్ను కలిసి కొన్ని ఆధారాలు అందించారు. అనంతరం డీజీ బృందం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన సీడీ ఫైళ్లు, ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్, లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకున్న ఆర్డర్‌ కాపీలను స్వాధీనం చేసుకుంది. తర్వాత పరకామణి భవనానికి వెళ్లి, అక్కడ హుండీ ఆదాయాన్ని లెక్కించే తీరును పరిశీలించింది. సేవకులు పరకామణిలోకి ప్రవేశ, నిష్క్రమణ వేళల్లో పాటించే తనిఖీ పద్ధతులు, సీసీ కెమెరాల నిఘాను గమనించింది. సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రానికి వెళ్లి ఫుటేజీలు చూసింది.

అన్ని ఆధారాలూ సేకరిస్తున్నాం: డీజీ
తిరుపతిలోని రెండో అదనపు మున్సిఫ్‌ న్యాయమూర్తి కోటేశ్వరరావు వద్దకు వెళ్లిన డీజీ బృందం.. లోక్‌ అదాలత్‌లో పరకామణి కేసును రాజీ చేసుకున్న రికార్డులను సేకరించింది. చివరిగా అయ్యన్నార్‌ తితిదే పరిపాలన భవనంలోని సీవీఎస్‌వో కార్యాలయానికి వెళ్లి దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ కేసుకు సంబంధించి తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం, లోక్‌ అదాలత్‌లో రాజీ చేసిన పత్రాలు, న్యాయస్థానానికి పోలీసులు అందించిన ఫైళ్లు, తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లోని సీడీ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటిని హైకోర్టుకు అప్పగిస్తామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వివరాలన్నీ సేకరిస్తామని చెప్పారు.