
కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే ప్రతి భక్తుడికి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చూడాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. విజయవాడలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ఇంజినీ రింగ్, ఏఈవోలు, సూపరింటెండెంట్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ఆలయానికి చెందిన ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. దసరా ఉత్సవాలలో సిబ్బంది పని తీరు, సహనాన్ని ప్రతి ఒక్కరూ గమనించారని, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. అదే తీరులో రానున్న కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలలో భక్తులకు మరింత సేవలు అందించాలని సూచించారు. రానున్న ఉత్సవాలలో ఎక్కడ అలక్ష్యం జరిగినా సహించేది లేదన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలన్నారు.





