
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకుల ప్రతి చర్యలోనూ దేశమే ప్రథమం’’ అన్న స్ఫూర్తి ఎల్లప్పుడూ అత్యంత ప్రధానంగా వుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ 126 వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆరెస్సెస్ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయ దశమికి మరో ప్రత్యేకత కూడా వుందని, ఈ విజయ దశమికి ఆరెస్సెస్ స్థాపించి, 100 సంవత్సరాలు పూర్తవుతోందని అన్నారు. ఈ శతాబ్దపు ప్రయాణం అత్యద్భుతమని, అపూర్వమని, స్ఫూర్తిదాయకమని మోదీ పేర్కొన్నారు.
వంద సంవత్సరాలుగా ఆరెస్సెస్ దేశానికి అవిశ్రాంతంగా సేవ చేస్తోందని, అందుకే దేశంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలుసంభవించినప్పుడు, ముందుగా అక్కడికి చేరుకునేది ఆరెస్సెస్ స్వయంసేవకులేనని, ఇది అందరమూ చూస్తున్నామని అన్నారు.
‘‘100 సంవత్సరాల క్రితం ఆరెస్సెస్ స్థాపించినప్పుడు దేశం శతాబ్దాలుగా బానిసత్వ సంకెళ్లలో బంధించబడి వుండేదని, ఆ బానిసత్వం మన ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీసిందన్నారు.ఇక్కడి ప్రజలు ఆత్మ న్యూనతా భావంతో వుండేవారని, ఈ సందర్భంలోనే కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఆరెస్సెస్ ను స్థాపించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆరెస్సెస్ ఆద్య సరసంఘచాలక్ డాక్టర్జీని గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పటి పరిస్థితులపై డాక్టర్జీ గాఢంగా ఆలోచించేవారు. ఈ కష్టమైన పని కోసం 1925 లో విజయ దశమి సందర్భంగా ఆయన ఆరెస్సెస్ ని స్థాపించారు. వారి నిష్క్రమణ తర్వాత గురూజీ ఈ గొప్ప యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇదం రాష్ట్రాయ ఇదం నమమ అని తరుచూ చెప్పేవారు. ఇది నాది కాదు. ఇదంతా దేశానిదే అని చెప్పేవారు. ఈ భావం మనల్ని స్వార్థానికి అతీతంగా ఎదగడానికి, దేశం పట్ల అంకిత భావం తీసుకురావడానికి ప్రేరేపిస్తుంది. గురూజీ ఇచ్చిన పిలుపుతో లక్షలాది మంది స్వయంసేవకులకు సేవా మార్గాన్ని చూపించింది. త్యాగం, సేవ అన్న భావన, క్రమశిక్షణ సంఘ్ కి నిజమైన బలం అని పేర్కొన్నారు’’ అని మోదీ గుర్తు చేశారు.





