ArticlesNews

ఇంద్రకీలాద్రి విజయవాటిక విశేషాలు

309views

(దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకం)

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి గొప్ప చరిత్ర ఉంది. విజయవాడ అనేది విజయ వాటిక నుంచి వచ్చిన పేరు. ఇది విజయస్థలం. బ్రహ్మాండ పురాణంలోనూ ఈ ప్రదేశానికి ఇంద్రకీలాద్రి, కనకాచల అనే రెండు పేర్లున్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. దుర్గమాసురుడు అనే రాక్షసుడిని శ్రీదుర్గ సంహరించిన ప్రదేశం, పాశుపతాస్త్రం కోసం శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం ఇదే. బ్రహ్మపురాణంలోని ఉత్తరఖండంలోనూ రుద్ర, నారద సంవాదంలో ఇంద్రకీలాద్రి దుర్గాదేవి మహత్యం, కొండపై ఉన్న దుర్గా కుండం విశిష్టతల గురించి వివరాలు ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. లోకకంఠకుడైన మహిషాసురుడిని సంహరించిన తర్వాత ఇంద్రాది దేవతల కోరికపై ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా అమ్మవారు కొలువైనట్టు పురాణాలు చెబుతున్నాయి. జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేశారు. అమ్మవారి ఆలయం అత్యంత పురాతనమైనదిగా కొన్ని శాసనాలు చెబుతున్నాయి.

గోపురానికి బంగారు తాపడం..
2000 ఏడాదిలో ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయాలనే ప్రణాళిక రూపొందించారు. 2003లో కేవలం పావు భాగం గోపురం మాత్రమే బంగారు తాపడం చేసి, ఆలయం ఎదుట బంగారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మళ్లీ 2004లో కృష్ణా పుష్కరాల తర్వాత నుంచి గోపురానికి బంగారు తాపడం పనులు ఆరంభించారు. 2008 ఏడాది చివరికి ప్రస్తుతం ఉన్న బంగారు గోపురం సిద్ధమైంది. ప్రస్తుతం ప్రధాన ఆలయం మొత్తాన్ని స్వర్ణమయం చేయాలని.. దాతల నుంచి బంగారం సేకరిస్తున్నారు.
ఘాట్‌రోడ్డు ఒకప్పుడు కాలిబాట..

దుర్గగుడి ఘాట్‌రోడ్డు ఒకప్పుడు కాలిబాటగా ఉండేది. తర్వాత క్రమంలో దానిని రహదారిగా మార్చారు. ఆరంభంలో కనకదుర్గానగర్‌లోని అమ్మవారి పాతమెట్లు ఒక్కటే ఆలయానికి ఉండేవి. భక్తులు కొండపైకి మెట్ల ద్వారానే వెళ్లేవారు. కొండపైన భవానీదీక్ష మండపం, పక్కనే చీకటి కోనేరు ఉండేవి.

అత్యంత పురాతన శాసనాల్లోనూ ఆనవాళ్లు
10వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్ల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయంలోని కొన్ని నిర్మాణాలు జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో విష్ణువర్థన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విష్ణుకుండిన వంశానికి చెందిన రాజా మాధవవర్మ విజయవాడను 440-460 మధ్య పరిపాలించిన సమయంలో ఆయన ధర్మనిరతికి మెచ్చి దుర్గమ్మ కనకవర్షం కురిపించినట్టు ఒక కథనం ఉంది. అప్పటినుంచే కనకదుర్గమ్మగా పేరొచ్చినట్లు చెబుతారు. తూర్పు చాళుక్యదేశ మహామండలేశ్వర పల్లకేత భూపాలుని శాసనంలో విజయవాడ రాజు మాధవవర్మ గురించి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన విషయం లిఖించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.

చాళుక్యుల పాలనలో అభివృద్ధి..
దుర్గమ్మ ఆలయాన్ని చాళుక్యులు అభివృద్ధి చేసి, ఉపాలయాలను నిర్మించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బెజవాడను పాలించిన వేంగి రాజులు అమ్మవారి ఆలయ పూజలు, నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 1528 నాటి సింగభూతి శాసనంలో అంతరాలయం, రాగమండపం, భోగమండపం కట్టించినట్లు, రాయల శాసనంలోనూ దుర్గమ్మ ఆలయం ముందు అంతరాలయం కట్టించినట్లు ఉన్నాయి. 1589నాటి శాసనంలో అక్షతల తిరుమలభట్టు ఆలయానికి మెట్లు కట్టించినట్లు వివరాలు ఉన్నాయి.

రాజగోపురం వచ్చాకే కళ..
దుర్గగుడికి ఎదురుగా రాజగోపురం నిర్మించేందుకు 1985లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణాళికలు రూపొందించారు. ఆగమ శాస్త్రం ప్రకారం.. భక్తులు తూర్పు వైపునుంచి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని రాజగోపురం నిర్మాణానికి ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారు. కానీ.. ఆ తర్వాత పనులు ముందుకు కదల్లేదు. 2009 జనవరిలో ఘాట్‌రోడ్డులో భవానీదీక్షల విరమణ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు చనిపోయిన తర్వాత.. మళ్లీ రాజగోపురం, మహామండపం నిర్మాణానికి కదలిక వచ్చింది. ఘాట్‌రోడ్డుకు ప్రత్యామ్నాయంగా కొండపైకి వచ్చేందుకు మరో దారి అవసరమని గుర్తించి.. పనులు ఆరంభించారు.

ఈ పనులు 2015 వరకూ జరిగాయి. ఆ సమయంలోనే కొండ దిగువన శివాలయం ముందు వైపు కనకదుర్గానగర్‌లో ఇరుకుగా ఉందని.. అక్కడున్న ప్రైవేటు నివాసాలకు పరిహారం చెల్లించి.. స్థలం సేకరించారు. భక్తులు దిగి వెళ్లేందుకు కనకదుర్గానగర్‌లో విశాలమైన రాచమార్గం ఏర్పడింది.