News

వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలపై దర్యాప్తు: లద్దాఖ్‌ డీజీపీ

164views

లద్దాఖ్‌ ఉద్యమ నేత సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ ఎస్‌డీ సింగ్‌ జామ్వాల్‌ వెల్లడించారు. లేహ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాంగ్‌చుక్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ పాకిస్థానీ గూఢచారి-PIOని ఇటీవల అరెస్టు చేసినట్లు చెప్పారు. సోనమ్‌ నిరసనల వీడియోలను ఆ వ్యక్తి పాకిస్థాన్‌కు పంపినట్లు తెలిపారు.

‘‘లద్దాఖ్‌లో చెలరేగిన హింస వెనుక వాంగ్‌చుక్‌ కీలక వ్యక్తి. ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలో చోటుచేసుకున్న నిరసనలను ప్రస్తావించారు. ఆయన నేతృత్వంలో జరిగిన నిరసనల వీడియోలను పొరుగు దేశానికి రిపోర్ట్‌ చేస్తున్న ఓ పీఐవోను ఇటీవల అరెస్టు చేశాం. అదేవిధంగా వాంగ్‌చుక్‌ విదేశీ పర్యటనల్లో కొన్ని అనుమానాస్పదంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో ‘ది డాన్’ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌నూ సందర్శించారు.

వాంగ్‌చుక్‌ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేంద్రం, లద్దాఖ్‌ ప్రతినిధుల మధ్య చర్చలను అడ్డుకునేందుకు ఆయన యత్నించారు. ఈ నెల 25న ఇరుపక్షాల మధ్య సమావేశం ఉందని తెలిసీ.. తన నిరాహార దీక్షను కొనసాగించారు. సమావేశానికి ఒక రోజు ముందు రెచ్చగొట్టే వీడియోలు, ప్రకటనలు చేశారు. శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా యత్నించారు. ఇది హింసకు, మరణాలకు దారితీసింది’’ అని డీజీపీ జామ్వాల్‌ తెలిపారు.

లద్దాఖ్‌ హింసలో విదేశీ కుట్ర జరిగిందంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా చేసిన ఆరోపణలపై డీజీపీ స్పందించారు. ఇటీవలి ఘటనల అనంతరం ముగ్గురు నేపాల్ పౌరులు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారని, మరికొందరి ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చిందన్నారు. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో దాదాపు 10-12 మందిని ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు.

లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని, ఆ ప్రాంతాన్ని ఆరో షెడ్యూలు పరిధిలో చేర్చాలని కోరడంతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం సాగుతున్న ఉద్యమం ఇటీవల హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నలుగురు మృతిచెందగా.. 90 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే వాంగ్‌చుక్‌ను శుక్రవారం జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేసి వేరే ప్రాంతానికి తరలించారు. ఆయన అరెస్టును కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ ఖండించాయి.