
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నాం’’ అని మోదీ అన్నారు. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారని కొనియాడారు.
ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు..
అణు ముప్పులకు నవ భారతం భయపడదని మోదీ అన్నారు. ‘‘ఇది నవభారతం. ఎవరికీ భయపడదు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి వారిని మన బలగాలు మట్టుపెట్టాయి. అణుబెదిరింపులకు తలొగ్గదు’’ అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ అణు బెదిరింపులపై మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నాడు కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించిన సంగతి తెలిసిందే. భారత్ ఆర్మీ తమ రహస్య స్థావరాల్లోకి ప్రవేశించి ఎలా దాడులు చేసిందనే విషయాలను వెల్లడించాడు. పాకిస్థాన్ బుద్ధిని వారు బయటపెట్టారంటూ దీనిని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యలు చేశారు.





