
సంఘర్షణలు, సంక్షోభాల నేపథ్యంలో భారత్ మాత్రమే ప్రపంచానికి నైతికతను అందించగలదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ప్రపంచాన్ని పోషించే, సమౌతౌల్య వాతావరణాన్ని సాధించే సవాల్ తో కూడుకున్న పనులు భారత యువత ముందు వున్నాయని అన్నారు.ఎందుకంటే మనకు జ్ఞానం, నాగరికత, సంస్కృతి మరియు సంప్రదాయం ఉన్నాయని వివరించారు.
కంచిలో ‘‘యువ ధర్మ సంసద్’’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే కంచి కామ కోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు కూడా పాల్గొన్ని, ఆశీ: పూర్వక ప్రసంగం అందించారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ హెసబళే మాట్లాడుతూ మతం ధర్మంలో భాగం కావొచ్చు కానీ, మతమే ధర్మం అనడం సబబు కాదన్నారు. విధి నిర్వాహణ, నియమం, చట్టం, వ్యక్తిత్వం, ఇలా.. ఇవన్నీ ధర్మం అనే దానిలో సద్గుణాల నిధి అని వివరించారు. ధర్మం అంటే కేవలం ఆచారాలు, పూజలు మాత్రమే కాదని, నియమాలు, చట్టం, వ్యక్తిత్వం.. ఇలా అన్నీ దాని కోవలోకే వస్తాయన్నారు. భారత్ ఓ ధర్మ భూమి అని, నేడు ప్రపంచం ముందున్న ధర్మ భావనను భారత్ యుగయుగాలుగా ఓ ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి చేస్తూ వచ్చిందన్నారు.
మానవ జన్మ చాలా అరుదైందని, అందునా మానవత్వం, మోక్షం పొందాలన్న కాంక్ష మరింత అరుదైందన్నారు. పాపం, పుణ్యం, సుఖం, ధర్మం, ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న సంఘర్షణ, ద్వంద్వత్వం ఎప్పుడూ వుంటుందన్నారు. ఈ ద్వంద్వత్వం, సంఘర్షణలో మనిషి సుఖ భోగాలకు, వ్యక్తిత్వ నిర్మాణానికి మధ్య ఉద్రిక్తతలో చిక్కుకుంటాడని, ఈ సంఘర్షణ అత్యంత సహజమైన స్థితి అని వివరించారు.
మొత్తం సమాజం అనేక సంఘర్షణలను ఎదుర్కొంటూ, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, భారతదేశం ఒక నాగరికత, సంస్కృతి మరియు దేశంగా, ప్రపంచం ముందు సమాధానం చెప్పగల సామర్థ్యంతో నిలుస్తుందని తెలిపారు.
భారత్ పై మహర్షి అరవిందో చెప్పిన మాటలను హోసబళే ఉటంకిస్తూ.. ‘‘భారత్ ఉద్భవిస్తుంది. కానీ ఇతరులను అణచడానికి కాదు. అణచివేత ద్వారా బానిసలుగా మార్చేయడానికి కాదు. ప్రపంచంలోని చీకటిని పారద్రోలడానికి ఓ దీపస్తంభంగా ఎదుగుతూనే వుంటుంది’’అని చెప్పారని గుర్తు చేశారు.
డబ్బులు, శ్రమ లేకుండా జీవితం నడవదని, కానీ.. ఈ రెండూ ధర్మం పరిధిలోనే వుండాలని, వీటిపై పరిమితులను విధించేది ధర్మమని వివరించారు. సమతౌల్యతను కాపాడే బాధ్యత ధర్మం తీసుకుందని, దీని ద్వారా ప్రపంచంలో విశ్వాసం పెంపొందుతుందన్నారు. క్షీణిస్తున్న జీవితాన్ని తిరిగి నిలబెట్టేది ధర్మమని, ప్రపంచం అయోమయంలో వున్నప్పుడు ధర్మం అత్యంత అవసరం అవుతుందని అన్నారు.
గత 75 సంవత్సరాలుగా మన ధర్మం నుంచి విద్యా వ్యవస్థను దూరంగా వుంచే ప్రయత్నాలు జరిగాయని, పాఠ్యాంశాల్లో ధర్మానికి సంబంధించిన విషయాలను చేర్చకుండా కొందరు తిరస్కరించారన్నారు. ధర్మం అంటే అదేదో కళంకం అనేట్లు కొందరు చిత్రీకరించారన్నారు.ధర్మం ఆధారిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి సాగాలని హోసబళే పిలుపునిచ్చారు.





