
దాదాపు 145 రోజుల తర్వాత లద్ధాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంపత్రిపత్తి కల్పించిన అధికరణ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా అంతర్జాల సేవల్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న ప్రాంతాల్లో క్రమంగా సేవల్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే తాజాగా కార్గిల్‌లో ప్రజలకు అంతర్జాల సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత నాలుగు నెలల్లో కార్గిల్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితులు ప్రస్తుతం పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకున్నాయన్నారు. అయితే ఈ సదుపాయాన్ని ఎవరూ దుర్వినియోగం చేయోద్దని స్థానిక మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేశారన్నారు.
అధికరణ 370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీకి కొన్ని రోజుల ముందు నుంచి జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా టెలికాం, అంతర్జాల సేవల్ని నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో మొబైల్ పోస్ట్ పెయిడ్ సేవల్ని పునఃప్రారంభించారు. అనంతరం కొన్ని ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ సర్వీసుల్ని, బ్రాడ్‌బ్యాండ్ సేవల్ని కూడా పునరుద్ధరించారు. కానీ మొబైల్ అంతర్జాల సేవలపై మాత్రం కశ్మీర్‌లోయలోని చాలా ప్రాంతాల్లో ఇంకా నిషేధం కొనసాగుతోంది. ఇక క్రమంగా మిగతా ప్రాంతాలకూ పునరుద్ధరణ నిర్ణయాన్ని విస్తరించే అవకాశం ఉంది. రద్దు నేపథ్యంలో లోయలో భారీగా మోహరించిన బలగాల్ని కూడా కేంద్రం క్రమంగా ఉపసంహరిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





