News

నా జీవితంలో ముఖ్యమైన గురువులు వారే: శుభాంశు శుక్లా

143views

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్‌, కాక్‌పిట్‌ మాత్రమేనని పేర్కొన్నారు. వాటి నుంచే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని.. చాలామంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అంతరిక్షం నుంచి భారత్‌ ఎంతో అందంగా కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. జీవితంలో తాను చూసిన అద్భుత దృశ్యాలలో అదీ ఒకటన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ దిశగా..
ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా దేశం లిఖిస్తున్న అధ్యాయానికి గగన్‌యాన్‌ మిషన్‌ మొదటి అడుగని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మన దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లి.. పెసలు, మెంతులు వంటి వాటిని పండిస్తారని తానెప్పుడూ ఊహించలేదన్నారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు చెందిన శుభాంశు అంతరిక్షంలో రైతుగా మారారని అన్నారు. ఐఎస్‌ఎస్‌లో గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి..జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే అంతరిక్ష యాత్రలకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు.. గగన్‌యాన్‌ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందని రాజ్‌నాథ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో భారత్‌ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ..అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపే చూస్తున్నాయని..న్యూదిల్లీతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాయని అన్నారు. కాగా 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చందమామ పైకి పంపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.