
మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసేందుకు అంతరిక్షంలో సుదూర తీరాలను శోధించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగం కావాలని సూచించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం దేశవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు, విద్యార్థులు, విధానకర్తలనుద్దేశించి వీడియో మాధ్యమంద్వారా ప్రసంగించారు. ‘మనం చంద్రుడు, అంగారకుడిని చేరుకున్నాం. ఇప్పుడు అనేక రహస్యాలు దాగున్న రోదసిలోని సుదూర తీరాలపై పరిశోధనలు చేయాల్సి ఉంది. దానివల్ల భవిష్యత్తు తరాలకు మరిన్ని వెలుగులు ప్రసాదించే అవకాశం దక్కుతుంది. అంతరిక్ష రంగంలో ఒకదాని తర్వాత మరో విజయం మనకు, మన శాస్త్రవేత్తలకు ఆనవాయితీగా మారిపోయింది.
ఏ సరిహద్దూ చివరిది కాదని మనకు విశ్వం చెబుతోంది’ అని మోదీ పేర్కొన్నారు. 2040లో భారత్ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వికసిత్ భారత్ ఖ్యాతిని చాటుతారని పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే స్థితికి మనం చేరుకోగలమా అని అంతరిక్ష శాస్త్రవేత్తలను ఆయన ప్రశ్నించారు. శాస్త్రవేత్తలు చేస్తున్న కృషితో త్వరలో గగన్యాన్ మిషన్ను ప్రారంభించనున్నామని, మరి కొన్నేళ్లలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రైవేటు రంగం మరింతగా ముందుకు రావాలని సూచించారు. అంతరిక్ష విజన్లో భాగంగా తదుపరి తరం సంస్కరణలను తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.





