News

కైలాసగిరిపై 55 అడుగుల త్రిశూలం

145views

విశాఖపట్నంలో పర్యాటక నగరంగా తీర్చిదిద్దే దిశగా మరో అడుగు ముందుకుపడింది. వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ) విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న కైలాసగిరికి మరిన్ని హంగులు అద్దుతోంది. నగరంలోని కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేస్తున్నారు. కైలాసగిరిపై రూ.1.50 కోట్లతో భారీ త్రిశూలం, ఢమరుకం నిర్మాణానికి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనితలు భూమిపూజ చేశారు. కైలాసగిరిపై 55 అడుగుల ఎత్తయిన త్రిశూలం నిర్మిస్తారు.. దానితో పాటు 18 అడుగుల ఢమరుకం కూడా ఉంటుంది. నగరం మొత్తం కనిపించేలా ఈ త్రిశూలం, ఢమరుకాన్ని తయారు చేస్తారు. దీని నిర్మాణానికి ఫైబర్ ఉపయోగిస్తారు.. తుఫాన్‌లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. కైలాసగిరిపై ఏర్పాటు చేస్తున్న ఈ త్రిశూలం, ఢమరుకం హనుమంతవాక వైపు ఉంటుంది. ప్రతిరోజూ చీకటిపడిన తర్వాత వెలుగులు విరజిమ్మేలా ప్లాన్ చేశారు. అంతేకాదు విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో యూహెచ్‌-3 హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు.. దీనిని మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనితలు కలసి ప్రారంభించారు.

కైలాసగిరిపై ఇప్పటికే శివపార్వతుల విగ్రహం ఉంది.. విశాఖపట్నం వచ్చిన ప్రతి పర్యాటకుడు అక్కడికి వెళ్లి కచ్చితంగా ఫోటోలు తీసుకుంటారు. విశాఖపట్నంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా కైలాసగిరి ఉంది. ఇప్పుడు భారీ త్రిశూలం, ఢమరుకం ఏర్పాటుతో మరింత పర్యాటకశోశ కనిపిస్తుందని భావిస్తున్నారు.. త్వరలోనే ఈ త్రిశూలం పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.