
తిరుపతి ఎల్‌ఎస్ నగర్ వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఎస్వీ గోసంరక్షణ శాలలో అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు. ఓ డెయిరీ అసిస్టెంట్ సత్యకృపవాణిపై అనుమానం రావడంతో టిటిడి తిరుపతి వీజీవో వచ్చి విచారించారు. డీఏ చరవాణిని తీసుకుని మెసేజ్‌లు పరిశీలించగా అన్యమతానికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. ఎస్వీ గోశాలలో నిర్వహిస్తున్న దర్శన్ అగరబత్తీ కేంద్రంలోనూ అన్యమతస్థులు సుమారు 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఎస్వీ గోసంరక్షణ శాల సంచాలకులు శ్రీనివాసులును వివరణ కోరగా.. ‘డీఏని వీజీవో వచ్చి విచారించి వెళ్లారు. దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. విజిలెన్స్ అధికారులకు అనుమానం వస్తే మరింత లోతుగా విచారించి ఈ విషయాన్ని నిగ్గు తేలుస్తారు. దర్శన్ అగరబత్తీ కేంద్రం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. ఇందులో పనిచేసే సిబ్బందికి, టిటిడికు ఎటువంటి సంబంధం లేదు’ అని చెప్పారు.





