
భారత రక్షణ శాఖ కల్పించిన అవకాశం జీవిత కాలం మర్చిపోలేని అద్భుత అనుభూతిని పంచిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన గిరీష్‌చంద్ర చెమ్మగిల్లిన కళ్లతో తెలిపారు. పంద్రాగస్టును పురస్కరించుకుని శుక్రవారం భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోని స్మితివ్యాలీలో భారత ఆర్మీ చీఫ్ కమాండ్ అధికారి స్వాప్‌నిల్ సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు.
అడుగడుగునా అడ్డంకులు..: భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన స్మితివ్యాలీకి వెళ్లే సమయంలో భారీ వర్షాలతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయని గిరీష్ చంద్ర తెలిపారు. 500 కిలోమీటర్ల పొడవునా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం సాగించామని, భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడ్డాయన్నారు. బురదతో రోడ్లు నిండిపోయాయని, ఆ రోడ్ల గుండా అత్యంత కష్టంతో ప్రయాణం సాగించి స్మితివ్యాలీకి చేరుకున్నట్లు వివరించారు. ఇదో సాహసోపేతమైన ప్రయాణమని, ఈ అవకాశం లభించడం మహద్భాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు.





