ArticlesNews

అఖండ భారత్ కల్పన కాదు సంకల్పం

244views

ఆగష్టు 14 –
ఎందరో వీరులు విశ్రమించకుండా చేసిన లెక్కలేనన్ని పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా 14 ఆగష్టు 1947 శుక్రవారం అర్థరాత్రి అమావాస్య నాడు వేయి సంవత్సరాల బానిసత్వాన్ని వదిలించుకున్న రోజు. అదే రోజు భారత్ మూడు ముక్కలుగా, రెండు దేశాలుగా విడిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిందని సంబర పడాలా భారతమాత ముక్కలైందని బాధ పడాలా..స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవాల్సిందే..మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే…కానీ అదే సమయంలో చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మళ్లీ అలాంటి దుస్థితి మన దేశానికి రాకూడదు.

అసలు అఖండ భారత్ అంటే ఏంటి..??అఖండ భారత్ అంటే అవిభక్త భారతదేశం అని అర్థం. దీని భౌగోళిక విస్తీర్ణం పురాతన కాలంలో చాలా విస్తృతంగా ఉండేది. ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాయన్మార్,థాయ్‌లాండ్‌లను కలిగి ఉంది. అఖండ భారత్ అనే ఆలోచన సనాతన భారతీయ నాగరికత వలె పురాతనమైనది. 3వ శతాబ్దం బిసి నాటికి భారతీయ ఉపఖండంలో ఇప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆధునిక భారత్, నేపాల్, బర్మా, టిబెట్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి ఆధునిక దేశాలు అనేక స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉన్నాయి. చాణక్యుడు అఖండ భారత్ అనే ఆలోచనను కూడా వ్యక్తపరిచాడు. అంటే ఈ ప్రాంతంలోని అన్ని రాజ్యాలు ఒకే అధికారం, పాలన, పరిపాలన కింద ఉన్నాయి. గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు వినాయక్ దామోదర్ సావర్కర్, హిందువుల సాంస్కృతిక, మత, రాజకీయ ఐక్యతను నొక్కి చెబుతూ అఖండ భారత్, హిందూ రాష్ట్ర అనే భావనను ప్రతిపాదించారు. ‘అఖండ భారత్’ అనే పదంలో జాతీయవాదం, సమగ్ర సంస్కృతికి సంబంధించిన అన్ని ప్రాథమిక విలువలు ఉన్నాయని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చెప్పారు.

అఖండ భారత్ ప్రస్తావన రాగానే కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఇది సామ్రాజ్య విస్తరణ కోసం చెప్పే మాట కాదని గుర్తించాలి. ఆంగ్లేయ పాలన ప్రారంభం కాకముందు ఒకే రాజు పాలనలో లేకపోయినా ఈ దేశం ఒక్కటిగానే ఉంది. సాంస్కృతిక ఏకత్వం ఈ దేశాన్ని ఒకటిగా నిలిపి ఉంచిందన్న విషయం గ్రహించాలి. ఆధ్యాత్మికత ఆధారంగా ఏర్పడిన ఏకాత్మ దృష్టి ఈ దేశపు ప్రత్యేకత. వేల సంవత్సరాలుగా ప్రపంచానికి ఈ ప్రత్యేకత ఏమిటో తెలుసు. ఈ దృష్టిని, ప్రత్యేక అస్తిత్వాన్నే `హిందూత్వం’ అనే పేరుతో గుర్తించింది. హిందూత్వం అంటే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలోని విషయం కాదు. నిజానికి హిందూత్వం అంటే ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వమనే విషయం గుర్తుపెట్టుకుంటే రాజకీయ వివాదాలు, విమర్శలు రావు. `world history of Economics’ అనే తన పరిశోధన గ్రంధంలో ప్రముఖ బ్రిటిష్ ఆర్ధిక వేత్త ఆంగస్ మాడిసన్ క్రీ. శ ఒకటవ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ప్రపంచ వ్యాపారంలో భారత్‌దే అతిపెద్ద వాటా అని పేర్కొన్నాడు. అతను చెప్పినది ఈ భౌగోళిక, సాంస్కృతిక ఏకత్వం కలిగిన భారత్ గురించే.

భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అంటే బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, బూటాన్‌లను కలిపి అఖండ భారత్ అంటారు. అంటే బ్రిటిష్ వారి పాలనకు ముందున్న భారతదేశం. బ్రిటిష్ వాళ్లు విశాల భారతదేశాన్ని విభజించు పాలించు సిద్ధాంతంతో కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు. మరి, ఈస్ట్ ఇండియా కంపెని పాలనా విధానాలకు వ్యతిరేకంగా 1857లో ఐక్యంగా పోరాటం చేసిన హిందువులు, ముస్లింలు ఎలా దూరమయ్యారు. “I am a Nationalist, Nationalist first, Nationalist last” అన్న మహ్మదాలి జిన్నా ఎందుకు మారాడు? దేశ విభజన వద్దంటున్నందుకు ముస్లిం లీగ్ మహ్మదాలి జిన్నా నేతృత్వంలో 16 ఆగష్టు 1946న “Direct Action Day”కు దిగి కలకత్తాలో హిందువులను వేల సంఖ్యలో చంపడమే గాక, అత్యాచారాలు చేసారు. మానభంగానికి గురైన మహిళలను పరమార్శించడానికి “సుచేత కృపలాని” కలకత్తాకు సైనేడ్ టాబ్లెట్‌తో వెళ్లిందంటే నాటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. 3 జూన్ 1947న “సిమ్లా ఒప్పందం” జరిగి దేశ విభజనకు మార్గం సుగమం చేసారు బ్రిటిష్ వారు. ఇంత పెద్ద దేశాన్ని “సర్ రాడ్ క్లిఫ్” 40 రోజుల వ్యవధిలోనే విభజించి, కేవలం‌ 48 కిలోమీటర్ల సరిహద్దు రేఖ గీసాడు. గ్రామపంచాయతి భారత్ లో, గ్రామం పాకిస్థాన్‌లో ఉండేటట్లుగా అస్పష్టంగా సరిహద్దు రేఖను గీసి, స్వాతంత్ర్యం వచ్చాక కూడా కొట్టుకు చచ్చేలా చేసారు.

బెర్లిన్ గోడలు బద్దలు కొట్టుకుని జర్మనీ ఏకమైనట్లుగా, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంలు కలిసి వియత్నాంగా మారినట్లు మనం కోల్పోయిన భూభాగాలన్ని ఏకం చేయడానికి ఏకాత్మత స్ఫూర్తి చెందేలా ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. “ఖండిత విగ్రహాన్ని పూజించడం అనర్థం. ఖండిత దేశాన్ని ఆరాధించడం అనర్థం.” అన్న అరవింద ఘోష్ మాటలే స్ఫూర్తిగా అఖండ భారత్ సాధనే ధ్యేయంగా కదులుదాం.