ArticlesNews

గోవు విశిష్టత

272views

ప్రాణులలోకెల్ల సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువల్ల వీటిని బంగారము, వెండి అంటాము. ఆవుపాలు దాని మూపురం గుండా స్రవించి లభిస్తాయి. ఆవు మూపురంలో స్వర్ణ నాడి ఉంది. కనుక ఆవు పాలలో స్వభావసిద్ధంగానే బంగారపు తత్వం ఇమిడి ఉంది. ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం. భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది. అందుకే దాని పాలు రోగరహితము, ఆరోగ్యప్రదము, పౌష్టికమైనవిగా ఉంటాయి. ఆవు పాలు గుండె జబ్బు రోగులకు ప్రత్యేకించి ఉపయోగించబడతాయి. ఆవుపాలలోని పసుపుపచ్చ పదార్థం కళ్ళలోని జ్యోతిని వృద్ధి పరుస్తుంది. కళ్ళకలక వస్తే పాలలో తడిపిన గుడ్డపట్టీ కడితే నయమవుతుంది. ధన్వంతరి నిఘంటువు ప్రకారం ఆవుపాలలో రసాయనము, పథ్యము, బలవర్థకము, హృదయానికి హితం చేకూర్చేది. మేధస్సును పెంచేది, ఆయుర్వృద్ధి, పుంసత్వం కలిగించేవి. ఇంకా వాత-పిత్త-కఫాలను రూపుమాపే గుణాలున్నాయి.

తెల్ల ఆవుపాలు వాతాన్ని, నల్ల(కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపురంగు ఆవుపాలు కఫాన్ని హరించి వేస్తాయి. కపిలగోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైనది. ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. ఆవుపాలలో పౌష్టిక పదార్థాలు – 87.3%, నీరు, కార్బోహైడ్రేట్స్, క్రొవ్వు పదార్థము, ప్రొటీన్లు ప్రతీదీ 4% కాగా ఖనిజ ద్రవ్యము 0.7% ఉంటాయి. కనుక ఈ పాలు పసి పిల్లలకు, తల్లులకు, పెద్దలందరికీ పూర్ణ ఆహారంగా భావించవచ్చు. అంతేగాక ఆవుపాలలో ఎ,బి,సి,డి,ఇ విటమిన్లు అన్నీ సరియైన పాళ్ళలో ఉండడం వల్ల ఇది శరీరానికి శక్తినిస్తుంది. ఆవుపాలు సులభంగా జీర్ణమయ్యేవి మరియు పోషక శక్తి కలిగినవి. ఆవుపాలలోని పసుపుపచ్చదనం సర్వరోగ నివారకమే గాక విషాన్ని హరించే శక్తి కూడా దానికి ఉంది. ఈ గుణం కేవలం తల్లిపాలలో మాత్రమే ఉంటుంది. కనుకనే ఆవును తల్లితో సమానంగా భావిస్తాం.