
ఆయన సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. గిరిజనుడు. వారిది గోండి భాష. దానికి లిపిలేదు. మహాభారత ఇతిహాసాన్ని కుటుంబాల్లో పెద్దల నుంచి వినడం ద్వారా దానిపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ గ్రంథాన్ని గోండి భాషలోకి తెలుగు లిపితో అనువదించడం ద్వారా.. గిరిజనుల్లో చదువుకున్న వారికి, నేటి తరానికి అందుబాటులోకి తేవాలని కంకణం కట్టుకున్నారు. పండోక్న మహాభారత్ కథ పేరుతో అందుబాటులోకి తెచ్చారు. ఈ గ్రంథం ఆయనను ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం అందేలా చేసింది. ఆ ఉపాధ్యాయుడే ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్‌కు చెందిన తొడసం కైలాస్. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ‘ఎట్ హోం’ కార్యక్రమంలో పాల్గొనాలని ద్రౌపదీముర్ము నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వాన లేఖను సోమవారం తపాలాశాఖ అధికారులు సందీప్‌కుమార్, మునీర్, మహేశ్‌రెడ్డి, ప్రణయ్, సాయికుమార్‌లు ఆయన ఇంటికి వెళ్లి అందజేసి అభినందనలు తెలిపారు.




