News

ఇండో- నేపాల్ సరిహద్దుల్లో పుట్టగొడుగుల్లా ‘‘అక్రమ మదర్సాలు’’

166views

ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో చట్టవిరుద్ధమైన, అనుమతులు లేని అక్రమ మదర్సాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ విషయం తాజాగా బయటపడింది. ఓ జాతీయ మీడియా దీనిపై పరిశోధన చేయగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అక్రమ మదర్సాల నెట్ వర్క్ ఓ క్రమబద్ధంగా నడుస్తోందని కూడా తేలింది. ఇందులోని విద్యార్థులకు జిహాదీ పాఠాలు కూడా నూరిపోస్తున్నారన్న విషయం బట్టబయలైంది. అంతేకాకుండా ఈ అక్రమ, చట్టవిరుద్ధ మదర్సాలు నడవడానికి విదేశాల నుంచి నిధులు కూడా అందుతున్నాయి.

మరీ ముఖ్యంగా హవాలా మార్గం ద్వారా, గల్ఫ్ దేశాల నుంచి ఈ అక్రమ మదర్సాలు ఎలా డబ్బులు తీసుకుంటున్నాయి? అన్న విషయం కూడా దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా జిహాదీ కంటెంట్ ను తయారు చేసి, విద్యార్ధుల బుర్రల్లో ఎలా విషబీజాలు నాటుతున్నారో కూడా బయటకి పొక్కింది.

ముఖ్యంగా నేపాల్ సరిహద్దు వెంబడి వున్న బిహార్ లో అనేక మదర్సాలు గుర్తింపు లేకుండానే నడుస్తున్నాయి. వీటిలో ముజఫర్ పూర్, సీతామర్హి, బాజ్ పట్టి, పర్సుని వంటి మారుమూల ప్రాంతాల్లో ఈ అక్రమ మదర్సాలున్నాయి. ముజఫర్ పూర్ లోని జామియాలో రెండు దశాబ్దాలకు పైగా మదర్సాలు నడుస్తున్నాయి. తమకు మోరాజుల్ ఉలూమ్ హవాలా ద్వారా తాము నిధులు స్వీకరిస్తున్నామని నూరియా అనే ఉపాధ్యాయుడు బహిరంగంగానే అంగీకరించాడు.ఈ డబ్బుతోనే విద్యార్థులకు జిహాదీ పాఠాలు చెప్పి ప్రేరేపిస్తామని, దశలవారీగా విద్యార్థులను బ్రెయిన్ వాష్ చేస్తామని కూడా అంగీకరించాడు.

ఇక.. సీతామర్హిలోని బాజ్ పట్టి ప్రాంతంలో కూడా అక్రమ మదర్సాలు నడుస్తున్నాయి. దానిపేరు మదర్సా ఇస్లామియా మెహమూడియా. ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ రేకుల షెడ్డులో నడుస్తోందన్న విషయం పరిశోధనలో తేలతెల్లమైంది. దీనిని అజ్రుద్దీన్ దిల్ ఖుష్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు.ఈ అక్రమ మదర్సాకి నేపాల్ ద్వారా, గల్ఫ్ ద్వారా డబ్బుఅందుతోంది. కానీ.. దీనిని విరాళాల సేకరణ అని ఓ పేరు పెట్టినట్లు తేలింది. అంతేకాకుండా ఈ మదర్సాల్లో బంగ్లాదేశ్ మూలాలున్న వారిని, పత్రాలు, గుర్తింపు కార్డులు లేకున్నా… తీసుకుంటామని, నకిలీ భారతీయ ఐడీలను కూడా ఉపయోగిస్తారని కూడా స్వేచ్ఛగా అసలు విషయాన్ని బయటపెట్టాడు.

దీమా అనే గ్రామంలో కూడా ఇదే తంతు. దారుల్ ఖురాన్ అనే ప్రాంతంలో మదర్సా ఇస్లామియా పేరుతో అక్రమ, చట్టవిరుద్ధ మదర్సా నడుస్తోందని తేలింది. ప్రభుత్వ కమ్యూనిటీ హాలులోనే వుంది. ఇక్కడ అత్యంత వివాదాస్పదుడు జకీర్ నాయక్ వీడియోలను కూడా విద్యార్థులకు తరుచూ చూపిస్తుంటారు. తలీమ్-ఉల్-ఇస్లాంను ఒకటో తరగతి నుంచే బోధిస్తారిక్కడ.

మహోత్తరి జిల్లాలోని మదర్సాలో కూడా పైలాగే నడుస్తోంది. గల్ఫ్ నిధులతో వచ్చే హవాలా డబ్బుతోనే తాము ఈ అక్రమ మదర్సాను నడుపుతున్నామని నిర్వాహకుడు మహ్మద్ షాహిద్ హుస్సేన్ అంగీకరించాడు.అలాగే పాక్, లెబనాన్ వంటి దేశాల నుంచి కూడా ప్రసంగాలు ఇవ్వడానికి వచ్చారని, విద్యార్థులకు కూడా బోధించారని అంగీకరించాడు.

ధనుషా జిల్లాలో కూడా అక్రమ, చట్టవిరుద్ధ మదర్సాలు నడుస్తున్నాయి. మదర్సా ద్వారా జిహాదీ శిక్షణ కూడా ఇస్తున్నారు. జిహాదీకి సంబంధించిన పాఠ్య పుస్తకాలను విచ్చలవిడిగా పిల్లలకు ఇస్తున్నారు. పిల్లలను జిహాద్ కి సిద్ధం చేస్తామని, అందుకే ఇలా చేస్తున్నామని కూడా నిర్వాహకులు మీడియా ముందు చెప్పేశారు.