
భారతీయ దృక్పథం ఆధారంగా విద్యా విధానంలో కొత్త మార్పులు చేర్పులు చేపట్టాల్సిన అవసరం వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. గతంలోని విద్యా వ్యవస్థ పూర్తిగా వలసవాద ప్రభావానికి లోనైందని, అందుకే భారతీయ దృక్పథం ఆధారంగా విద్యలో కొత్త నమూనాలను ఈ తరానికి అందించాలని, అందుకు అందరూ సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. ‘‘శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్’’ కి సంబంధించిన జాతీయ చింతనా బైఠక్ లు కేరళలో జరిగాయి. ఈ కార్యక్రమానికి మోహన్ భాగవత్ హాజరై.. మార్గనిర్దేశనం చేశారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ… విద్యా వ్యవస్థలో భారతీయ మూలాలతో వున్న విద్యను అందించడానికి కార్యకర్తలు ముందుగా సమర్థులుగా మారాలని, ఓ మోడల్ గా నిలవాలని సూచించారు. దీని కోసం కార్యకర్తలకు తరుచుగా, క్రమం తప్పకుండా శిక్షణ అవసరమని అన్నారు.
ఈ పనులన్నీ సవ్యంగా సాగాలంటే సమన్వయం కూడా అత్యంత అవసరమని మోహన్ భాగవత్ అన్నారు. సమన్వయ పరిధి అనేది వ్యక్తి నుంచి మొదలు పెడితే ప్రపంచం వరకూ వుంటుందని, అందరూ కలిసే నడవాలన్నారు. అయితే ఈ సమన్వయ సాధనలో ఓపిక అవసరమని, ఓపికతో ఇతరులను అర్థం చేసుకునే గుణం, ఆ భావన కూడా అంతే అవసరమన్నారు. ఓ సంస్థ సమన్వయం ద్వారానే తన పరిధిని విస్తరించుకుంటుందని అన్నారు.
శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్ ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ అతుల్ కొఠారీ మాట్లాడుతూ.. విద్యను నూతన దిశను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. 2004 నుంచి దేశ, కాల పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తూనే, ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యలోని అన్ని విభాగాలనూ స్పృశించాలని, ఒకదానికి మరో దానికి మధ్య సమన్వయం వుండాలన్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను అనుసంధానిస్తున్నామని, ఇకపై తల్లిదండ్రులను కూడా అనుసంధానించడానికి ప్రయత్నాలు సాగాలని సూచించారు.





