
తెలుగు పంచాంగం ప్రకారం పన్నెండు మాసాల్లో ఐదోది శ్రావణ మాసం. సకల శుభాల మాసం శ్రావణ మాసం అంటారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక జులై 25 శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో ముగుస్తుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ మాసంలో వచ్చినన్ని పండుగలు మరే మాసంలో కూడా రావు. మరీ ఈ నెల రోజుల్లో రానున్న పండుగల గురించి తెలుసుకుందాం.
శ్రావణ మాసంలోని పండుగలు, విశిష్టత:
జులై 25 శుక్రవారం శ్రావణ శుద్ధ పాడ్యమి: శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణంలో మొదటి శుక్రవారం. మహిళలు ప్రత్యేక పూజలు జరుపుకుంటారు.
జులై 29 నాగ పంచమి: ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్దలతో చేస్తే కుజ దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు సంతాన కారకుడు. అందుకే సంతానం కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
జులై 29 మంగళ గౌరీ వ్రతం: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు. ఈ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన వధువులు.. తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు నిండు ముత్తైదువులుగా జీవిస్తారని నమ్మకం. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఆగష్టు 8 వరలక్ష్మి వ్రతం: శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదిగానే చెబుతారు. అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని గురించి వివరించినట్లుగా చెబుతుంటారు. ఆగస్టు 1,15, 22 తేదీల్లో కూడా వరలక్ష్మీవ్రతం జరుపుకోవచ్చు.
ఆగష్టు 9 రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి: హిందువులు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. కొంతమంది తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుకనే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు.
ఆగష్టు 16 శ్రీకృష్ణ జన్మాష్టమి: శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రావణ బహుళ అష్టమి రోజును కృష్ణాష్టమిగా, జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు ఉట్టికొట్టడం ఆచారం. శ్రీకృష్ణుడు స్వయంగా సంచరించి నడయాడిన ద్వారకా, బృందావనం, మధురలో జన్మాష్టమి సంబరాలు అంబరాన్నంటుతాయి.
ఆగస్టు 23 పోలాల అమావాస్య: శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అమావాస్యని పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానం కోసం ఈరోజున మహిళలు ప్రత్యేక పూజను నిర్వహిస్తారు. ఈరోజున అమ్మవారిని పూజిస్తే.. పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఈ రోజు కందమొక్కను పూజించడం సాంప్రదాయం.




