News

ఏయూ పూర్వ విద్యార్థుల ‘తారామండల్‌’ స్టార్టప్‌నకు ఫోర్బ్స్‌ గుర్తింపు

166views

ఈ రోజుల్లో బీటెక్, ఎంటెక్‌ చదివిన యువత బహుళజాతి కంపెనీల వైపు వెళుతుంటే ఈ నలుగురు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. కాళ్ల వద్దకు వచ్చిన ఉద్యోగావకాశాలను కాదనుకుని అంకుర (స్టార్టప్‌) సంస్థను స్థాపించి లక్ష్యం వైపు దూసుకు పోతున్నారు. ఫోర్బ్‌ ఎంపిక చేసిన అంకుర సంస్థల జాబితాలో స్థానం సంపాదించి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకొన్నారు.

బుల్లి రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌.: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎ.వినీల్‌ జడ్సన్, డి.రాజేష్, ఎం.గౌతమ్, నీలకంఠ ఎంటెక్‌ పూర్తి చేశారు. తర్వాత ఉద్యోగాలు చేయాలని అనుకోలేదు. అంతరిక్షంపై ఉన్న ఆసక్తిని గురువు, ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఎలక్ట్రానిక్స్‌ ఆచార్యులు ఆచార్య పసుమర్తి మల్లికార్జునరావుతో పంచుకున్నారు. వారి ఆలోచనలకు సంపూర్ణ సహకారం అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. 2020లో కొవిడ్‌ మహమ్మారి సమయంలో వీరు ఇంటికే పరిమితం కాలేదు. ఆచార్యుని సహాయంతో బుల్లి రాకెట్‌ తయారు చేశారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ అది ఆకాశం వైపు దూసుకుపోయింది. అప్పుడే అంకుర సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ‘తారామండల్‌’ పేరుతో అంకుర సంస్థను స్థాపించి 2023లో రిజిస్ట్రేషన్‌ చేయించారు.

‘తారా మండల్‌’ లక్ష్యం ఇది: ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు 50వేలకుపైగా కృత్రిమ ఉపగ్రహాలు (శాటిలైట్లు) ప్రయోగించి ఉంటాయని అంచనా. ఇవన్నీ కాలం తీరిన తర్వాత అంతరిక్షంలో వ్యర్థాలుగా మారిపోతున్నాయి. అందుకు పరిష్కార మార్గం చూపాలని నలుగురు యువకులు భావించారు. ఆచార్య మల్లికార్జునరావు సహకారంతో ‘పునర్వినియోగించే ఉపగ్రహ సాంకేతికత అభివృద్ధి (రీ యూజబుల్‌ శాటిలైట్‌ టెక్నాలజీ) చేయాలని నిర్ణయించారు. అంతరిక్షంలోకి వెళ్లిన ఉపగ్రహం కాలం తీరిన తర్వాత మళ్లీ భూమిపైకి తీసుకు రావాలనేది వీరి లక్ష్యం. వాటిని కొద్దిపాటి మార్పులతో మళ్లీ వినియోగించవచ్చు. తద్వారా అంతరిక్షంలో వ్యర్థాలను నివారించడంతోపాటు ప్రభుత్వాలకు ఆర్థిక భాగం తగ్గించవచ్చు.

ప్రయోగానికి సిద్ధంగా ‘ఐనా’: ‘ఈ ఏడాది చివరిలో ఐనా(అద్దం) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది అంతరిక్షంలో పరిభ్రమిస్తూ తనకు దగ్గరగా వచ్చే వ్యర్థ ఉపగ్రహాలను గుర్తించి గ్రౌండ్‌ స్టేషన్‌కు తెలియజేస్తుంది. వ్యర్థ ఉపగ్రహం ఢీకొనకుండా గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి ఐనాను దారి మళ్లిస్తార’ని తారామండల్‌ అంకుర సంస్థ ప్రతినిధి వినీల్‌ జడ్సన్‌ తెలిపారు. దీని తర్వాత ‘తారా తరంగ్‌’ పేరిట 2027లో మరో ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి డిజైన్‌ రూపొందించినట్లు వివరించారు.

‘ఐనా’ నమూనా ఉపగ్రహం
గుర్తించిన గ్లోబల్‌ ఫోర్బ్స్‌: తారా మండల్‌ అంకుర సంస్థ ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి ఆలోచనలు నచ్చి ఇజ్రాయెల్‌ దేశం సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్‌ ఫోర్బ్స్‌ సంస్థ దేశంలోని 200 ప్రభావంతమైన అంకుర సంస్థలను గుర్తించగా అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క ‘తారా మండల్‌’కే చోటు లభించింది. ‘తమ ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వెన్నుతడితే నిర్ణీత సమయంలో ఉపగ్రహ ప్రయోగాలు చేయగలమ’ని వినీల్‌ జడ్సన్‌ చెబుతున్నారు.