News

ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై జాత్యహంకార దాడి

179views

ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి ఆస్పత్రిలో చేరాడు. అసలేం జరిగిందంటే..

ఈనెల 19న అడిలైడ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన చరణ్‌ప్రీత్‌ సింగ్‌ తన భార్యతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తమ కారును ఓ పక్కన పార్క్‌ చేసి నడుస్తుండగా.. ఐదుగురు దుండగులు వేరే వాహనంలో అక్కడికి వచ్చి చరణ్‌పై భౌతిక దాడికి దిగారు. పదునైన వస్తువులతో కొడుతూ.. అతన్ని దూషించారు. ఈ ఘటనలో చరణ్‌ ముఖం, వెనక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.

కారు పార్కింగ్‌ కారణంగానే వివాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆస్పత్రిలో చరణ్‌ మాట్లాడుతూ.. ఈ దాడి తనను కలచి వేసిందన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలనిపిస్తుందన్నారు. ఇక, దాడికి పాల్పడిన దుండగుల్లో 20 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మిగిలిన వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ పీటర్‌ మాలినాస్కస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి జాత్యహంకార దాడులను సహించేది లేదని పేర్కొన్నారు.