News

పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

160views

పహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టీఆర్‌ఎఫ్‌ అనేది పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘లష్కరే తయిబా’ ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు.

‘‘మా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపునిచ్చారు. ఇదే మా పరిపాలన నిబద్ధతను చెబుతోంది’’ అని రూబియో తెలిపారు. ‘ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌’ను విదేశీ ఉగ్రవాద సంస్థ-FTOగా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్‌ టెర్రరిస్ట్‌-SDGT ఆర్గనైజేషన్‌గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. 2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్‌ రూబియో వెల్లడించారు. భారత భద్రత దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్‌ఎఫ్‌ బాధ్యత వహించిందని పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని సహించకూడదు: భారత్‌
ఈ పరిణామాలను భారత్‌ స్వాగతించింది. ‘‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌-అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనం ఇది. ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాం. టీఆర్‌ఎఫ్‌ అనేది లష్కరే ముసుగు సంస్థ. పహల్గాంలో అనేక మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదు’’ అని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.

ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి నిర్వహించారు. దీంతో ప్రపంచమంతా ఈదాడిని ఖండించింది. అనంతరం భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌పై దాడులు చేపట్టి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది.