News

ఇస్లాంపుర్‌ ఇక ఈశ్వర్‌పుర్‌.. మహారాష్ట్ర సర్కార్‌ నిర్ణయం

230views

మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంగ్లీ జిల్లాలోని ఇస్లాంపుర్‌ పేరును ఈశ్వర్‌పుర్‌గా మార్పు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మారుస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా,, కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ఇస్లాంపుర్‌ పేరును ఈశ్వర్‌పుర్‌గా మార్చాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉండగా.. తాజాగా హిందుత్వ సంస్థ శివ్‌ ప్రతిష్ఠాన్‌ మరోసారి ఈ అంశంపై కలెక్టరేట్‌లో విజ్ఞాపన పత్రం అందజేసింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేరు మార్పునకు ఆమోదం తెలిపింది. ఇస్లాంపుర్‌ పేరు మార్చాలన్న డిమాండ్‌ 1986 నుంచి పెండింగ్‌లో ఉందని శివసేన నేత ఒకరు తెలిపారు.