News

విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్

170views

మద్యం మత్తులో ఓ వ్యక్తి ఇనుప గొట్టంతో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దాలెమ్మరాజువలస గ్రామంలోని శివాలయంలో ఈ నెల 11న రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి విలేకరులకు తెలిపారు. ‘దాలెమ్మరాజువలసకు చెందిన వేముల రామకృష్ణ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ నెల 12న అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. అతనికి 2019లో వివాహం కాగా.. ఆ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. వారిద్దరూ అనారోగ్య కారణాలతో చనిపోవడంతో రామకృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ఆమె 2022లో అతణ్ని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి దేవుడ్ని నిందిస్తూ అతిగా మద్యం తాగేవాడు. ఈ నెల 11న వడ్రంగి పనికి వెళ్లి యజమాని నారాయణరావు వద్ద రూ.300 తీసుకున్నాడు. ఆ సొమ్ముతో మద్యం సీసా కొనుగోలు చేసి శివాలయం వద్ద తాగాడు. ఆ తరువాత ఆలయంలో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేశాం’ అని ఎస్పీ వివరించారు.

మద్యం మత్తులో ఓ వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనను మత విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో పలువురు సామాజిక మాధ్యమాల్లో అదే పనిగా విష ప్రచారం చేశారని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిని గుర్తించి కేసులు నమోదు చేశామని చెప్పారు. జిల్లాలో వివిధ మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు 3,300 ఉన్నాయని.. వాటి వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు