
కేంద్ర వాణిజ్యశాఖ ప్రకటించిన ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ 10 అవార్డులను గెలుచుకొంది. సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, దిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాల చేతులమీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖల మంత్రి సవితతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎ, బి క్యాటగిరీల్లో మొత్తం 29 అవార్డులు అందించగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు 10 దక్కాయి.
ఎ-క్యాటగిరీలో రాష్ట్రాలకు ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ బంగారుపతకం గెలుచుకొంది. వ్యవసాయేతర ఉత్పత్తుల్లో జిల్లాలకు ప్రకటించిన అవార్డుల్లో గుంటూరు జిల్లా (మిరప) బంగారు పతకాన్ని, శ్రీకాకుళం జిల్లా (జీడిపప్పు) కాంస్య పతకాన్ని చేజిక్కించుకొంది. వ్యవసాయేతర ఉత్పత్తుల విభాగంలో ప్రకటించిన అవార్డుల్లో బాపట్ల జిల్లా (చీరాల పట్టు చీరలు-కుప్పాడం), విజయనగరం జిల్లా (బొబ్బిలి వీణ), తిరుపతి జిల్లా (వెంకటగిరి కాటన్ చీరలు) బంగారుపతకాలు సొంతం చేసుకున్నాయి. ఇదే విభాగంలో శ్రీసత్యసాయి జిల్లా (ధర్మవరం పట్టుచీరలు) రజతం, అనకాపల్లి జిల్లా (ఏటికొప్పాక బొమ్మలు), కాకినాడ జిల్లా (పెద్దాపురం సిల్క్స్) కాంస్య పతకాలు అందుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా (నరసాపురం లేస్ అల్లికలు) ప్రత్యేక బహుమతిని సొంతం చేసుకొంది.
ఈ కార్యక్రమానంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో హస్తకళలు, చేనేతకు పూర్వవైభవం వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత, హస్తకళలను ప్రోత్సహించడానికి ప్రతి నెలా ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహించడంతోపాటు, వారికి అవసరమైన మార్కెట్ లింకేజి సౌకర్యం కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా, చేనేతశాఖ కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు, 9 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.





