
పౌరాణిక నాటకాలకు ఆదరణ తగ్గిపోతున్న నేటి డిజిటల్ యుగంలో.. కొందరు రంగస్థల నటులు వాటికి జీవం పోసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోట్లాది హిందువుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘రామాయణం’ గాథ పాకిస్థాన్ గడ్డపై ప్రదర్శితమవుతోంది. కరాచీ నగరంలో ఓ నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టింది. ఇందులోని కళాకారులు పాకిస్థానీయులే కావడంతోపాటు స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం.
పాకిస్థాన్‌కు చెందిన యోగేశ్వర్ కరేరా, రాణా కజ్మాలకు నాటక రంగంపై మక్కువ ఎక్కువ. థియేటర్ ఆర్ట్స్‌తోపాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందారు. మరికొందరితో కలిసి ‘మౌజ్’ అనే ఓ నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత నవంబర్‌లో ‘ది సెకండ్ ఫ్లోర్ (T2F)’ పేరిట ఉన్న ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. దానికి మంచి ఆదరణ రావడంతోపాటు పాక్ నాటక రంగంలోనే మైలురాయిగా నిలిచింది. దీంతో మరిన్ని హంగులు జోడించిన ఈ బృందం.. కృత్రిమమేధ సాయంతో వేదికను రంగులమయంగా మార్చారు. ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో ఇటీవల మూడు రోజులపాటు దీన్ని ప్రదర్శించారు.
‘రామాయణం’నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు ఎదురవుతాయని ఎప్పుడూ భావించలేదని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా తెలిపారు. రామాయణాన్ని దృశ్యకావ్యంగా మలిచామని.. స్థానికుల నుంచి మద్దతు లభించడం గొప్ప విషయమన్నారు. ఈ నాటకానికి ఆదరణతోపాటు నటీనటుల కృషికి విమర్శకుల నుంచీ ప్రశంసలు వచ్చాయని చెప్పారు.
ఈ పురాణ కథను ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనతో ఈ నాటకం ప్రదర్శించినట్లు ప్రొడ్యూసర్, ఈ నాటకంలో సీత పాత్రలో కనిపించిన రాణా కజ్మా పేర్కొన్నారు. చిత్ర విమర్శకుడు ఒమియర్ అలావీ మాట్లాడుతూ.. కథ చెప్పడంలో నిజాయతీ, లైటింగ్ తీరు, లైవ్ మ్యూజిక్, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, అబ్బురపరిచే డిజైన్‌లు.. ఇవన్నీ ఈ ప్రదర్శనను మరింత గొప్పగా మలిచాయని అన్నారు.





