
పాకిస్థాన్‌లో బలోచ్ రెబల్స్ చెలరేగిపోతున్నారు. తాజాగా దక్షిణ బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలపై దాడి చేసి తొమ్మిది మందిని కాల్చి చంపారు. ముందుగా పలు బస్సులను ఆపి వీరిని కిడ్నాప్ చేశారు. అనంతరం సమీపంలోని పర్వతాల్లోకి వారిని తీసుకెళ్లి హత్య చేసినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. అర్ధరాత్రి వారి మృతదేహాలు బయటపడినట్లు గవర్నమెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు ఏ గ్రూపు ఈ దాడికి బాధ్యత వహించలేదు. కానీ, ఈ ప్రాంతంలో గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర బలోచ్ రెబల్స్‌కు ఉంది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ వారిని గుర్తించి మరీ కిడ్నాప్ చేశారు.
పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ బామ్’
బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ ప్రభుత్వంపై అతిపెద్ద దాడిని మంగళవారం ప్రారంభించింది. దీనికి ‘ఆపరేషన్ బామ్’ అనే పేరు పెట్టింది. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని చాలా జిల్లాల్లో ప్రభుత్వ, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. దశాబ్ధాల నాటి పోరాటంలో కొత్త అధ్యాయం మొదలైందని ఈసందర్భంగా ఆ సంస్థ పేర్కొంది. పంజ్‌గర్, సురబ్, కెచ్, ఖరన్ జిల్లాల్లో కలిపి 17 దాడులు నిర్వహించింది. వీటికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లు, మిలిటరీ చెక్ పాయింట్లు ఉన్నాయి. ఈ ఘటనపై బీఎల్‌ఎఫ్ ప్రతినిధి మాట్లాడుతూ బలోచిస్థాన్ లిబరేషన్ వార్‌లో మరో సూర్యోదయం అయిందన్నారు. భద్రతా దళాల ఆయుధాలు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకొన్నట్లు చెప్పారు.


