
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపికకు కచ్చితంగా తమ ఆమోదముద్ర కావాలంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, ఆ అధికారం ఇంకెవరికీ లేదని స్పష్టంచేసింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈమేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకొనే హక్కు ఎవరికీ లేదు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనో లేదా ఆ సంస్థ మాత్రమే చేస్తుంది. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైనది’ అని రిజిజు పేర్కొన్నారు. దలైలామా 90వ పుట్టిన రోజు కార్యక్రమాలు బుధవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల సుగ్లాగ్‌ఖాంగ్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ తరఫున రిజిజు, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు లల్లన్ సింగ్‌లు హాజరుకానున్నారు.
తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం దలైలామా సోషల్ మీడియాలో పోస్టు ద్వారా తెలిపారు. భవిష్యత్తు గురువును గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు మాత్రమే గుర్తిస్తుందని, మరెవరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాకు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే చైనా దీనిపై స్పందించింది. తర్వాత దలైలామా ఎంపికకు తమ ఆమోదముద్ర ఉండాల్సిందేనని డిమాండ్ చేసింది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనా విధానాలను అనుసరించి నిర్వహించాలని పేర్కొంది.
1950లో టిబెట్‌ను చైనా ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి భారత్‌లోని ధర్మశాలలో దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. టిబెట్‌ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పుచేతల్లో ఉండే దలైలామాను వారసుడిగా ఎంపిక చేయాలని బీజింగ్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. చైనా ఎత్తుగడలను గమనించిన దలైలామా వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ తమదేనని తేల్చిచెప్పారు.




