
జూన్ 21న యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంది. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో యోగా ముఖ్యమైనది.యోగం ప్రధానంగా హిందూ ధర్మానికే చెందినది అయినా, హిందువులు దాన్ని తమకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. కమ్యూనిస్టు దేశం చైనా, పెట్టుబడిదారీ రాజ్యం అమెరికా ఎప్పటినుంచో యోగాను తమకు నచ్చినట్లు మార్చుకుని అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే… ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాధాన్యత గురించి వివరించడం, ఒక రోజు అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరపాలని భారత్ ప్రతిపాదించడం, దానికి దాదాపు ఏకగ్రీవంగా అన్ని దేశాలూ మద్దతు పలకడం చకచకా జరిగాయి.
మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలు సైతం యోగాపై మక్కువ ప్రకటించాయి. ముస్లిముల రీతిరివాజుల్లో ఉండే కొన్ని పద్ధతులు యోగభంగిమలను పోలి ఉంటాయని కూడా చెప్పుకున్నాయి. అయితే, హిందూ వ్యతిరేకత నరనరాల్లో నింపుకున్న కొందరు అతివాద ముస్లిములు యోగా అనే హిందూ మత పద్ధతులను ఆచరించడం తప్పంటూ మండిపడుతున్నారు. యోగా అభ్యసించే సామాన్య ముస్లిముల మీద దాడులకు సైతం వెనుకాడడం లేదు. తాజాగా ఈ యేటి యోగా దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ముస్లిం మహిళలు పాల్గొనడానికి ప్రయత్నించగా ఒక ముస్లిం అతివాది వారిపై విరుచుకు పడ్డాడు. అలాంటి సంఘటనలు కొన్నింటిని పరిశీలిద్దాం.
(1) యోగా చేస్తున్న ముస్లిం మహిళలపై దాడి:
2025లో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో జరుపుకున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని ప్రజలందరిలో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు భారీ కృషి చేసింది. ఆ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి ఒకానొక కార్యక్రమంలో కొందరు ముస్లిం మహిళలు పాల్గొన్నారు. అయితే ఒక అతివాద ముస్లిం వ్యక్తి ఆ మహిళలపై విరుచుకు పడి, వారిని ఆ కార్యక్రమంలో నుంచి బైటకు తరిమి కొట్టాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది.
(2) ముస్లిములకు యోగా అక్కర్లేదన్న ఉలేమా:
ముస్లిం మహిళలు యోగా కార్యక్రమంలో పాల్గొనకూడదు అంటూ 2025 జూన్ 20న మధ్యప్రదేశ్‌కు చెందిన కాజీ అనస్ అలీ అనే ఉలేమా బహిరంగంగా తన అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఇస్లాంకు యోగా అక్కర లేదంటూ ప్రకటన చేసాడు. ‘‘ఇస్లాంలో యోగా చేసే అతి ఉత్తమమైన విధానం రోజులో ఐదు సార్లు నమాజు చేయడమే’’ అని ప్రకటించిన కాజీ అనస్ అలీ, ముస్లిం మహిళలు యోగాకు దూరంగా ఉండాలి, దానికి బదులు నమాజ్ మీద ధ్యాస పెట్టాలి అని చెప్పుకొచ్చాడు.
(3) యోగా డే వేడుకలపై ఇస్లామిస్టు గుంపు దాడి:
ఈ సంఘటన 2022 జూన్ 21న మాల్దీవుల రాజధాని మాలేలో జరిగింది. ఆ రోజు మాలేలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమం జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి వంద మందికి పైగా ఇస్లామిక్ అతివాదుల గుంపు స్టేడియంలోకి చొరబడింది. చేతిలో జెండాలతో చెలరేగిపోయిన అతివాదులు, అక్కడ యోగా చేస్తున్న జనాలను తరిమి తరిమి కొట్టారు. ఆ సందర్భంగా అతివాద ముస్లిములు ఆ స్టేడియంలో ఉన్న, యోగా దినానికి సంబంధించిన పోస్టర్లను చింపేసారు, బ్యానర్లను విరిచేసారు, బోర్డులను ధ్వంసం చేసారు. అంతేకాదు, యోగా దినోత్సవ కార్యక్రమాన్ని రికార్డు చేస్తున్న కెమెరామెన్‌లపై దాడులు చేసారు.
(4) యోగా టీచర్‌కు హత్య బెదిరింపులు:
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో నివసించే రఫియా నాజ్ అనే మహిళ యోగా బోధకురాలు. ఒక ముస్లిం మహిళ అయి ఉండి యోగా టీచర్‌గా ఎలా చేస్తున్నావంటూ ఆమెకు బెదిరింపులు వచ్చేవి. చివరికి ఆమెను చంపేస్తామంటూ కూడా అతివాద ముస్లిములు బెదిరించారు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత తనకు ఆ బెదిరింపులు రావడం మొదలైందని రఫియా చెప్పారు. తర్వాత కొద్దికాలం బెదిరింపులు ఆగినా, 2017 అక్టోబర్ 10 నుంచి మళ్ళీ బెదిరింపులు రావడం మొదలయిందని ఆమె వివరించారు. అయితే తాను అలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని రఫియా చెప్పారు. తన జీవితాంతం యోగా అభ్యాసం చేయడాన్ని, యోగా బోధించడాన్నీ కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసారు. ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించింది. దానికి ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు.
(5) సౌదీలో మొదటి యోగా టీచర్‌కు బెదిరింపులు:
ఈ సంఘటన సౌదీ అరేబియాలో 2017 నవంబర్ 15న జరిగింది. ఆ దేశంలోని ముస్లిం మత పెద్దలు యోగా అభ్యాసాన్ని వ్యతిరేకించారు. నౌఫ్ అనే మహిళ సౌదీ అరేబియాలో గుర్తింపు పొందిన మొట్టమొదటి యోగా ఉపాధ్యాయురాలు. అరబ్ దేశాల్లో యోగా గురించి ప్రచారం చేయడంలో నౌఫ్ ప్రధాన పాత్ర పోషించింది. యోగా అభ్యాసం చేసేవారికి మత పెద్దల నుంచి బెదిరింపులు వచ్చేవని ఆమె వెల్లడించింది. ‘‘యోగా గురించి నా వ్యాసాలు ప్రచురితం అయిన తర్వాత నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నన్ను యోగా బోధించవద్దు అంటూ బెదిరిస్తూ ఆ కాల్స్ వచ్చాయి’’ అని నౌఫ్ తెలియజేసింది. యోగాను ప్రచారం చేయడంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళను ఆమె వివరించింది.
(6) హిందూ పద్ధతుల్లో యోగా చేయవద్దు:
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడానికి చాలా ముందు నుంచే ప్రపంచ దేశాల్లో యోగాకు ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. 2009లో ఆ దేశంలో యోగా అభ్యాసం విషయంలో ఆంక్షలు విధించారు. హిందూ ఆచార వ్యవహారాలు కలిగి ఉన్న యోగాను ముస్లిములు పాటించేటప్పుడు కొన్ని ఆంక్షలకు లోబడి అభ్యసించాలని ఆదేశించారు. యోగాలో ఉండే హిందూ పద్ధతుల వల్ల ఇస్లామిక్ విశ్వాసాలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో యోగా అభ్యాసానికి పరిమితులు విధించారు. ఇండోనేషియాలో ఇస్లామిక్ అధికార పెద్ద అయిన ఇండోనేషియన్ కౌన్సిల్ ఆఫ్ ఉలేమాస్ ఒక ప్రకటన వెలువరించారు. హిందూ సంప్రదాయంలో భాగంగా యోగా చేసేటప్పుడు మంత్రాలను ఉచ్చరిస్తారని, అలాంటి సంప్రదాయాలను పాటించవద్దనీ ఉలేమాల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
(7) మలేషియాలోనూ నిషేధం బెదిరింపులు:
ఈ సంఘటన మలేషియాలో 2008 నవంబర్ 16న జరిగింది. ఆ దేశంలోని ప్రధానమైన ఇస్లామిక్ సంస్థలు యోగాను నిషేధించాల్సి వస్తుందంటూ బెదిరించాయి. దానికి కారణం… యోగాను అభ్యాసం చేయడం వల్ల ముస్లిం మతాన్ని అనుసరించే వారు ఇస్లామిక్ బోధనలకు దూరం జరుగుతారు అని ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హెచ్చరించాడు. దాంతో ఇస్లామిక్ సంస్థలు ఆ దేశంలో యోగా అభ్యాసకురాలు అయిన నోరియెన్ హసన్ అనే మహిళకు బెదిరింపులు జారీ చేసాయి.
నోరియెన్ ఆ విషయంలో తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ‘‘యోగా అనేది ఒక రకమైన వ్యాయామం. దానివల్ల ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే యోగాను అభ్యాసం చేయడం నా మత విశ్వాసాలకూ సమస్య ఎలా అవుతుంది’’ అని ఆమె ప్రశ్నించింది.
ఉపసంహారం:
భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప కానుకల్లో యోగా ప్రముఖమైనది. దాన్ని అందిపుచ్చుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్న వారు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. చివరికి ముస్లిములు సైతం యోగాను అభ్యసించడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇస్లామిక్ అతివాదులు మాత్రం యోగా అనేది నేర్చుకుంటే ముస్లిములు హిందువులుగా మారిపోతారని భయపడుతున్నారు. అందుకే యోగా నేర్చుకుంటున్న, అభ్యాసం చేస్తున్న తమ తోటి ముస్లిముల మీద వారు దాడులకు దిగుతున్నారు, ఫత్వాలు జారీ చేస్తున్నారు, బెదిరింపులకు హెచ్చరికలకూ పాల్పడుతున్నారు.





