
పాకిస్తాన్‌లో ముస్లింలు కిడ్నాప్ చేసిన హిందూ పిల్లలను మళ్లీ ఆ కుటుంబానికి తిరిగివ్వాలంటే కోటి రూపాయలు డిపాజిట్ కట్టాలని కోర్టు ఆదేశించింది. ఎక్కడా కనీవినీ ఎరుగని వింత తీర్పును అక్కడి కోర్టులు మాత్రమే ఇవ్వగలవేమో…. వివరాల్లోకి వెళితే ఈ నెల 18న పిల్లలు చదివే స్కూల్లో వారి టీచర్ ఫర్హాన్ ఖాస్ఖేలి, అతని సహచరులు జుల్ఫికర్ ఖాస్ఖేలి, ఇర్ఫాన్ ఖాస్ఖేలి, మజీద్ ఖాస్ఖేలి షాహదాద్‌పూర్‌లోని ఒక కంప్యూటర్ సెంటర్ నుండి తుపాకీతో గురిపెట్టి తమ పిల్లలను అపహరించారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. వారిని ఎదిరించినప్పటికీ తమను బెదిరించి నిందితులు తమ పిల్లలను తీసుకెళ్లారని వారు ఆరోపించారు. అది జరిగిన మరుసటి రోజున మరో ఇద్దరు బాలికలు జియా బాయి (23), దియా బాయి (19) కూడా తప్పిపోయినట్లు ఫిర్యాదు చేయడంతో రెండవ ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరి తల్లిదండ్రులు అదే ముస్లిం వ్యక్తులను బాధ్యులుగా పేర్కొన్నారు. ఈ అపహరణలు షాహదాద్‌పూర్‌లో ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. హిందూ పంచాయితీ సభ్యులతో సహా వందలాది మంది నిరసనలలో పాల్గొని తప్పిపోయిన పిల్లలను వెంటనే కనుగొనాలని డిమాండ్ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడంతో చర్య తీసుకోవాలని పోలీసులుపైన, అధికారులపైన ఒత్తిడి పెరిగింది.
నాటకీయ మలుపులో, నలుగురు పిల్లలు అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత కరాచీలోని గోషా-ఎ-ఆఫియత్ ట్రస్ట్ వద్ద కనిపించారు. ఇస్లామిక్ దుస్తులు ధరించి స్వచ్ఛందంగా ఇస్లాంను స్వీకరించినట్లు చెబుతున్నట్టు ఈ పిల్లలు ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రసారం అయ్యాయి. విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. ఈ వీడియోలను చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చెబుతున్నారో మాకు అర్థం కావట్లేదనీ, మా పిల్లలు మా దగ్గరికి తిరిగి రావాలని కోరుకుంటునట్లు ప్రకటించారు.
సంచలన తీర్పిచ్చిన కోర్టు…
ఆ తర్వాత జూన్ 20న, నలుగురు పిల్లలను భారీ పోలీసు భద్రత మధ్య షాహదాద్‌పూర్ కోర్టుకు తీసుకువచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మైనర్ పిల్లలు పూర్తి ఇస్లామిక్ దుస్తులలో కనిపించారు; దశినా , దియా అబాయాలలో, హర్జీత్ ముఖం కప్పుకుని కనిపించారు.. కోర్టులో వాదోపవాదాలు చాలా క్లుప్తంగా సాగాయి. 18 ఏళ్లు పైబడిన జియా, దియా ఇద్దరూ తాము ఇష్టపూర్వకంగా మతం మారామని మరియు గోషా-ఎ-ఆఫియత్ ట్రస్ట్‌లో ఉండాలని కోరుకుంటున్నామని న్యాయమూర్తికి చెప్పగా, మైనర్లైన దాషినా , హర్జీత్ కూడా స్వచ్ఛందంగా మతం మారినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, మైనర్లుగా వారిని వారి తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనికి కొన్ని షరతులను పెట్టింది. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను హిందూ మతంలోకి తిరిగి రావాలని బలవంతం చేయద్దని అలా చేయకుండా ఉండడానికి కోర్టుకు హామీ ఇవ్వడానికి కోటి రూపాయలను డిపాజిట్ చేయాలి అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పిల్లలు ఇస్లాం మతాన్ని ఆచరించడం కొనసాగించడానికి అనుమతించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా తల్లిదండ్రులు ఎవరిపైన అయితే కేసు పెట్టారో ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొనబడిన ప్రధాన నిందితుడు ఫర్హాన్ ఖాస్ఖేలిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం.
ఇదెక్కడి న్యాయం?
హిందూ పంచాయతీ షాహదాద్‌పూర్ అధ్యక్షుడు వినోద్ కుమార్ ఈ తీర్పును తీవ్రంగా విమర్శించారు. వారు ది రైజ్ న్యూస్‌తో మాట్లాడుతూ “ఇది అన్యాయం. మా పిల్లలను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చారు, ఇప్పుడు వారిని తిరిగి మేము ఇంటికి తీసుకెళ్లాలంటే డబ్బు చెల్లించాలని చెబుతూ వారు ముస్లింలుగానే ఉండాలని కోర్టు ” అని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రధాన నిందితుడైన ఫర్హాన్ ఖాస్ఖేలిని సరైన దర్యాప్తు లేకుండానే వదిలిపెడుతున్నారు. అది అనుమానాస్పదంగా లేదా? అతని ప్రమేయం లేకపోవడానికి ఎలా అవకాశం ఉంది?” అని ఆయన అన్నారు. అంతేకకుండా పిల్లల వాంగ్మూలం నమోదు చేయడంలో కాస్త సమయం ఇవ్వమని హిందూ పంచాయితీ కోరింది. ఎందుకంటే పిల్లలు ఒత్తిడిలో ఉన్నారు. వారు భయస్తులై ఉండవచ్చు అని అందుకే అలా చెబుతున్నారని చెప్పాం..కానీ కోర్టు మా మాట వినలేదు. ఒక భయానక వాతావరణంలో పిల్లలు స్వేచ్ఛగా ఎలా మాట్లాడగలడు అని ఆయన అన్నారు. కోర్టు తమ తరుపున వాదనలు సరిగ్గా వినకుండానే ఇలాంటి దారుణమైన తీర్పునిచ్చిందని వారు అన్నారు.
పాకిస్తాన్‌లో, హిందూ మైనారిటీలు కిడ్నాప్ కావడం, వారిని బలవంతంగా మతం మార్చడం అనేది కొత్తేమీ కాదు. ఇప్పటికీ అక్కడ మైనారిటీలైన హిందువులు ప్రాథమిక మానవ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు…వీరికి తగిన న్యాయం జరిగేదెప్పుడో వేచి చూడాలి.





