
అడ్డుకున్న గ్రామస్థులపై అక్రమ కేసులు….
తనకు పై నుంచి ఒత్తిడి ఉందన్న ఎస్సై….
ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ తలపెట్టిన చర్చి నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్న ఘటన ఈస్ట్ గోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలోని వెలమపేటలో చోటు చేసుకుంది. వెలమపేట వాస్తవ్యులు చెప్పిన కథనం మేరకు అసలు క్రైస్తవులే లేని ఆ గ్రామంలో చెన్నైకి చెందిన స్టీఫెన్ అనే వ్యక్తి ద్వారా మద్రాసుకు చెందిన కొందరు ఒక ఇంటిని స్థానికుల నుంచి కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసిన పత్రాలలో ఆ ఇంటిని నివాస స్థలంగానే పేర్కొన్నారు. స్టీఫెన్ ఆ ఇంటిని కొన్నప్పటి నుంచి అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి క్రైస్తవ మత ప్రచారకులను, క్రైస్తవులను రప్పించి పెద్ద పెద్ద స్పీకర్లు ఏర్పాటు చేసి నిరంతరం అన్యమత ప్రార్థనలు, పాటలతో గ్రామాన్ని హోరెత్తించసాగాడు. ఈ క్రమంలో గ్రామస్థులు కొందరు స్టీఫెన్ పెట్టిస్తున్న ప్రార్ధన కూటములవల్ల తమకు అంతరాయం కలుగుతుందని, తమ పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా స్టీఫెన్ వినకుండా తన ఇంట్లో తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానని వారికి బదులిచ్చాడు.

స్టీఫెన్ ను నిలదీస్తున్న గ్రామస్థులు

చర్చి నిర్మిస్తున్న స్థలానికి సమీపంలోని గుడిని చిత్రంలో చూడవచ్చు
అనుమతులు లేకుండా పెద్దపెద్ద శబ్దాలతో మైకులు ఎలా వినియోగిస్తారని గ్రామస్తులు స్టీఫెన్ ను నిలదీశారు. అయినా స్టీఫెన్ లెక్కచేయక ఏకంగా ఆ ఇంట్లో చర్చి నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. ఆ ఇంటికి సమీపంలోనే వినాయకుని గుడి ఉండడంతో ఆగ్రహించిన గ్రామస్తులు “ఇక్కడ క్రైస్తవులు ఎవరూ లేకుండానే చర్చి అవసరం ఏమున్నది? అసలు చర్చి నిర్మాణానికి నీకు అనుమతి ఉందా?” అని స్టీఫెన్ ను ప్రశ్నించగా తనకు ఎవరి అనుమతులూ అవసరం లేదని, తన ఇంట్లో, తన స్థలంలో తన ఇష్టం వచ్చిన నిర్మాణాలు చేసుకోవచ్చునని దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇలాంటి విషయాలపై తామేమీ చెయ్యలేమని ఎస్సై బదులిచ్చాడు. కానీ అదే సమయంలో స్టీఫెన్ కూడా గ్రామస్థులు కొందరిపై స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని మాత్రం ఎస్సై స్టేషన్ కి పిలిచి మందలించడం గమనార్హం. దాంతో సదరు గ్రామస్తులు స్టేషన్ బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు. దీనిపై గ్రామస్తులు ఎస్ఐ ని నిలదీశారు కూడా. తానేమీ చేయలేనని, తనకు పైనుంచి ఒత్తిడి ఉన్నదని, ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోమని ఎస్సై గ్రామస్తులకు స్పష్టం చేశాడు. దాంతో తాము తదుపరి న్యాయ పరమైన చర్యలకు పూనుకోనున్నట్లుగా గ్రామస్థులు తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





