News

కియోస్క్‌ల ద్వారానూ శ్రీవారి లడ్డూలు కొనొచ్చు

262views

తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్క్‌ల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని తితిదే తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం ప్రారంభించింది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు రద్దీ పెరుగుతుంటుంది. ఇప్పుడు వీటిని నియంత్రించేందుకు కియోస్క్‌ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. భక్తుడు తన దర్శన టికెట్‌ నంబర్‌ను కియోస్క్‌లో నమోదుచేసి తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి.

అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్‌లో ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు. దర్శన టికెట్లు లేని భక్తులు ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి రెండు లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఆ సంఖ్యను నాలుగుకు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లు ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో మూడింటిని ఏర్పాటుచేశారు. తిరుమల వ్యాప్తంగా సీఆర్వో విచారణ కేంద్రం, శ్రీపద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథిగృహాల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను కూడా కియోస్క్‌ల ద్వారా పొందే ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.