
శ్రీశైలంలో గతంలో లభ్యమైన రాగి రేకులపై తోకచుక్క, ఉల్కాపాతానికి సంబంధించిన విశేషాలు ఉన్నట్లు పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ప్రతి 72 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడడంతోపాటు ఉల్కాపాతం జరుగుతుంటుందని ఒక అంచనా. అప్పట్లో తోకచుక్క, ఉల్కలు పడిన ప్రాంతంలో విపత్తులు సంభవిస్తాయన్న నమ్మకం ఉండేది. 1456వ సంవత్సరంలో ఆ తోకచుక్కలు విజయనగర రాజ్యంలో పడతాయన్న విషయం ప్రజల్లో భయాందోళనలను సృష్టించింది. దీంతో అవి తన రాజ్యంలో పడకుండా అప్పటి రాజు మల్లికార్జున శ్రీశైలంలో భారీఎత్తున శాంతిహోమం చేయించారు. పూజలు ఫలించడంతో విజయనగర సామ్రాజ్య పరిధిలో తోకచుక్కలు పడలేదని రాజు విశ్వసించారు. దీంతో శాంతిహోమం చేసిన లింగనార్య అనే బ్రాహ్మణుడికి సింగపుర అనే గ్రామాన్ని దానం చేశారు. లింగనార్య ఖగోళశాస్త్రంలో మంచి ప్రావీణ్యమున్న వేద పండితుడు. ఆయా విశేషాలతో రాజు మల్లికార్జున సంస్కృత, నాగరి భాషల్లో రాగిరేకుల శాసనాలు రాయించినట్లు అధికారులు గుర్తించారు. 2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి శాసనాల్లోని వివరాలను అధ్యయనం చేస్తుండగా ఈ విషయాలు వెలుగు చూశాయని భారత పురావస్తుశాఖ శాసనాల అధ్యయన విభాగం సంచాలకులు మునిరత్నంరెడ్డి వివరించారు.





