
కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదంపై అనేక కోణాలు kiవెలుగులోకి వస్తున్నాయి. అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే అగ్నిప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉందా? ఈఘటనపై స్థానికులు ఏమంటున్నారు? పోలీస్‌ల రిపోర్ట్ ఏం చెబుతోంది? . ఈప్రమాదంపై డిప్యూటీ సీఎం ఏమన్నారు? ఆయన ఆదేశాలేంటో చూద్దాం.
ఆధ్మాత్మిక నగరి.. సరళ జీవనం.. ఉన్నత చింతనం. పరవశించే శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం అలజడికి దీపమే కారణమా? అంటే అవుననే అంటున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. ఆధ్యాత్మిక కేంద్రం కూర్మ గ్రామంలో ఈనెల 10 మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఎంక్వైరీ చేసిన పోలీసులు.. ఎటువంటి దురుద్దేశం లేదని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదంపై అల్లరి మూకలు ప్రమేయం లేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఆధ్యాత్మిక మందిరంలో కూర్మ గ్రామ సభ్యులు ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజ చేసుకున్న తర్వాత దీపాలు ఆర్పి వేసి వెళ్లి పోతారు. ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆగకపోయి ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనపై ఇప్పటికే ప్రమాద స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పంపామన్నారు. ఘటనకు దీపాల వలన జరిగిన అగ్ని ప్రమాదమే ప్రధాన కారణమని, అవాస్తవాలు వదంతులు ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు.
అయితే కూర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక హరేకృష్ణ మఠం వారు మాత్రం అగ్నిప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సొసైటీలో జరుగుతున్న మోసాన్ని తాము ప్రజలకు తెలియచేస్తుండడంతో తమపై కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. అగ్నిప్రమాదం ముమ్మాటికి కుట్రేనంటున్నారు. రానురాను కూర్మ గ్రామంలో జరిగే అనేక ప్రయోగాలను అడ్డుకునేందుకే ఇలాంటి ఘటనలు సృష్టించారని తెలిపారు.





