
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ( ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా.. కేవలం విశ్వాస్ కుమార్ (45) అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లోని సీట్ నంబర్ 11ఏ లో కూర్చున్న ఆయన ప్రాణాలతో బయటపడటం అద్భుతంగానే భావిస్తున్నారు. అయితే, ఆ సీటు అత్యవసర ద్వారాల్లో ఒకదానికి దగ్గర్లో ఉండటం ప్రమాదం నుంచి బయటపడటానికి దోహదం చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
సీట్ మ్యాప్ ప్రకారం.. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానాల్లో ఎకానమీ క్లాస్‌లో మొదటి వరుసలో ఉన్న ఆరు సీట్లలో 11ఏ ఉంది. అత్యవసర నిష్ర్కమణ ద్వారాల్లో ఒకదానికి దగ్గర్లో ఉన్న కిటికీ సీటు ఇది. అంతేకాదు గ్యాలరీ ఏరియాకు సమీపంలో ఉంటుంది. విశ్వాస్ కుమార్ ఎలా బయటపడ్డారని చెప్పడం తొందరపాటే అయినప్పటికీ.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు సమీపంలో ఉండటం కూడా ఆయన బయటపడటానికి కారణాల్లో ఒకటి అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎయిరిండియా వద్ద 27 బోయింగ్ (బీ787-8) విమానాలు ఉన్నాయి. ప్రతి విమానంలో 238 ఎకానమీ, 18 బిజినెస్ తరగతి సీట్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ విమానాలన్నింటినీ భద్రతా పరీక్షలకు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో 265 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక విమానంలో కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ లభ్యమైతే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను అన్వేషించే వీలు కలుగుతుంది.





