News

శ్మశానవాటిక కోసం ఉద్యమబాట

182views

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నెహళ్లి గ్రామస్తులు శ్మశాన వాటిక కోసం ఉద్యమబాట పట్టారు. గ్రామంలోని రెండువేల మంది సోమవారం ఊరి పొలిమేరలోని అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి 167 జాతీయ రహదారిపై 3 కి.మీ. మీర భారీ ర్యాలీ చేశారు. నినాదాలు చేస్తు పాదయాత్రగా మంత్రాలయం చేరుకున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్‌, శ్రీమఠం ప్రధాన ముఖద్వారం మీదుగా తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజల్‌ వెంటనే బందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు గంగుల మల్లికార్జున, అనుమేష్‌, తిక్కస్వామి డిమాండ్లతో కూడిన వినతిని తహసీల్దార్‌ రవికి అందజేశారు. భారీ ర్యాలీ కారణంగా మంత్రాలయంలో మూడు కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోగా రాకపోకలు స్తంభించిపోయాయి.

రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించాలి

విశ్వహిందూ పరిషత్ వీహెచ్‌పీ ఆదోని డివిజన్‌ కార్యదర్శి హనుమంతరెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్‌ ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ.. 400 ఏళ్లుగా ఉన్న శ్మశానంలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుపడటం సరికాదన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి శ్మశాన స్థలానికి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళనలో వీహెచ్‌పీ కార్యదర్శులు, ప్రముఖ్‌లు శ్రీరంగ, రవికుమార్‌, జగదీష్‌, గోవర్ధన్‌ నాయుడు, రాజశేఖర్‌స్వామి, గువ్వల నారాయణ, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.