News

జాగృతి వారపత్రికచే పోస్ట్‌మ్యాన్‌లకు ఘన సన్మానం

475views

మారుమూల ప్రాంతాలకు సైతం నిరంతరం తపాలా సేవలు అందిస్తూ సమాచార వారధులుగా నిలుస్తున్న పోస్ట్‌మ్యాన్‌లను నంద్యాలలోని జాగృతి వారపత్రిక తమ శాఖ తరపున ఘనంగా సత్కరించింది.

ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, సేవా భారతి నంద్యాల కర్నూలు జిల్లాల సంఘటనా కార్యదర్శి శ్రీ నీలకంఠం ప్రధాన వక్తగా మాట్లాడుతూ, భారత సైన్యం తర్వాత, వాహన సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకు కూడా వార్తలు, ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు ఎన్నో కీలక సేవలను భారతీయ తపాలా వ్యవస్థ అందిస్తోందని కొనియాడారు. జాగృతి వారపత్రికను ఇంటింటికీ చేరవేయడంలో తపాలా సేవకుల కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. దేశద్రోహ శక్తులు కనుమరుగై, సరిహద్దు రాష్ట్రాలు ప్రశాంతంగా ఉండటానికి ప్రతి భారతీయుడు జాతీయ భావాలతో నిండటమే కారణమని, ఈ విషయంలో జాగృతి పత్రిక చేస్తున్న కృషి ఎంతో గొప్పదని, భవిష్యత్తులో జాగృతిని ప్రతి గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు.

పోస్ట్‌మాస్టర్ శ్రీ ఖాసీం వలి మాట్లాడుతూ, తాను జాగృతి పత్రికను చదివానని, జాతీయ భావాలను, సంస్కృతి సంప్రదాయాలను చక్కగా తెలియజేస్తారని తెలిపారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ వంటి సమయాల్లో వాస్తవ విషయాలను సమాజంలోకి తీసుకువెళ్లడంలో ఈ పత్రిక కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఈ పత్రిక పంపిణీలో పాలు పంచుకోవడం, దానికి గుర్తింపుగా జాగృతి కార్యకర్తలు తమ సిబ్బందిని సన్మానించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

జాగృతి నగర ప్రముఖ్ శ్రీ చింతపల్లి వాసు మాట్లాడుతూ, 1922లో ప్రారంభమైన జాగృతి గత 77 సంవత్సరాలుగా జాతీయ భావ జాగరణలో పునీతమైందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ శ్రీ ఆది నారాయణ గారు (APM MAIL ) , శ్రీ SVRMK REDDY Rtd staff , పోస్టుమాన్లు , శాఖ సిబ్బంది అలాగే నగరంలోని తపాలా సేవకులతో పాటు సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ జిక్కా నరేంద్ర, శ్రీ కేశవ, శ్రీ కటకం నాగదీప్, జాగృతి జిల్లా ప్రముఖులు శ్రీనివాసులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.