News

ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్‌ నిరసనకారుడు!

273views

గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో చెలరేగిన విద్యార్థుల నిరసనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి పశ్చిమబెంగాల్‌లోని కాకద్వీప్‌ శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉన్నారు. దీంతో భాజపా-తృణమూల్‌ కాంగ్రెస్‌లు మళ్లీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన కోటా సంస్కరణల ఆందోళనల్లో న్యూటన్‌ దాస్‌ పాల్గొన్నట్లు ఆన్‌లైన్‌లో అనేక చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. దాస్‌ మాత్రం.. తాను భారతీయుడినేనని పేర్కొన్నారు. ఇందుకు మద్దతుగా పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు సహా కొన్ని పత్రాలను చూపించారు. అయితే ఆ ఫొటోలు, వీడియోలు ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ‘‘మా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వ్యవహారమై నేను గతేడాది బంగ్లాదేశ్‌ వెళ్లాను. అనంతరం అనూహ్యంగా ఆందోళనల్లో చిక్కుకుపోయాను. వాస్తవానికి నేను 2014 నుంచి కాకద్వీప్‌ ఓటరును. 2017లో నా ఓటరు కార్డు పోగా.. 2018లో స్థానిక శాసనసభ్యుడు మంతురం పఖీరా సహాయంతో కొత్తది తీసుకున్నాను. 2016లో జరిగిన పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును సైతం వినియోగించుకున్నాను’’ అని న్యూటన్‌ దాస్‌ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. న్యూటన్‌ బంగ్లాదేశ్‌లో జన్మించాడని, రెండు దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నాడని ఆయన సోదరుడు తపన్‌ పేర్కొనడం గమనార్హం.