News

అమర్‌నాథ్‌ యాత్రలో ముఖ గుర్తింపు వ్యవస్థ

267views

అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రవాద ముప్పును తప్పించే చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు పహల్గాం మార్గంలో వెళ్లే యాత్రికుల కోసం ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నిఘా కెమెరాల దృష్టికి బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తి ఎవరైనా వస్తే ఆ కెమెరాలు వెంటనే హెచ్చరికలు జారీ చేసే ఏర్పాటు జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. అమర్‌నాథ్‌ యాత్రలో భద్రతను కట్టుదిట్టం చేసే ప్రయత్నంలో భాగంగా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల, అనుమానిత ఉగ్రవాద కార్యకర్తల చిత్రాలు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో పొందుపరిచారు. ‘‘బ్లాక్‌లిస్టులో వున్న వ్యక్తులెవరైనా కెమెరా నిఘా కంటికి కనబడిన వెంటనే పర్యవేక్షక కేంద్రంలో గట్టి శబ్దంతో సైరన్‌ వినిపిస్తుంది. అలా అప్రమత్తమైన భద్రతాదళాలు ముప్పును మట్టుబెట్టేందుకు తక్షణం కదులుతారు’’ అని ఆ వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ తనలో పొందుపరచిన చిత్రాలు, వీడియోల ఆధారంగా ప్రమాదకర వ్యక్తుల్ని గుర్తించ గలుగుతుంది. వచ్చే నెల 3న దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 9న రక్షాబంధన దినోత్సవం రోజున ముగుస్తుంది. గతంలో ఈ యాత్ర మొత్తం 52 రోజుల పాటు సాగేది. దీన్ని 38 రోజులకు కుదించారు. గతంలోనూ ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. అందుకే ఈసారి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం’’ అని అధికారి ఒకరు తెలిపారు. యాత్ర సాగే మార్గం మొత్తంపై సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు.