
ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయం లో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరగనుందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈ క్రతువును నిర్వహించనున్నట్లు చెప్పారు. జ్యేష్టాభిషేకాన్ని ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారని, తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.
మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారని చెప్పారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారని, మూడవరోజు తిరుమంజనాదులు పూర్తి చేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారన్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారని, అంతవరకు బంగారు కవచంతోనే శ్రీవారు వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారని టీటీడీ అధికారులు తెలిపారు.





