News

దుర్గగుడి భూముల పరిరక్షణకు చర్యలు

177views

దేవదాయ శాఖ, దుర్గగుడి దేవస్థాన భూములు అన్యాక్రాంతం అంశంపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ దుర్గగుడి ఈవో శీనానాయక్‌తో సమావేశం నిర్వహించారు.విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో సమావేశం జరిగింది. ఇటీవల కాలంలో దేవ దాయ శాఖ, దుర్గగుడికి చెందిన భూములు, పొలాలు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం కావడంపై దాతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో దేవాలయ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌, ఈవోలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఆలయ భూములు ఉన్న మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారితో మాట్లాడారు. దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారుల వద్ద ఉన్న రికార్డుల మేరకు వెంటనే ఆలయ భూములను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. వివాదాలలో ఉన్న ఆలయ భూములు, పొలాల వివరాలను దుర్గగుడి లీజెస్‌ విభాగం అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ చైతన్య, దేవదాయ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.