
తరాలు మారేకొద్దీ తీపిగుర్తులుగా మిగిలేవి ఎన్నో. వారసత్వ కట్టడాలు, వృక్షాలు ఈ కోవలోకే వస్తాయి. గతంలో పెద్దలు వాటిని కథలుగా చెప్పేవాళ్లు. ఇప్పుడు అలాంటి వృక్షాలు ఉండటంలేదు. దీన్ని గమనించిన రాష్ట్ర అటవీశాఖ తమిళనాట ప్రస్తుతం మిగిలి ఉన్న వారసత్వ వృక్షాల్ని సంరక్షించి, వాటి విలువల్ని ప్రపంచానికి చాటాలని చూస్తోంది.
వారసత్వ వృక్షాల్ని కాపాడాలని, వాటి నేపథ్యాన్ని భావితరాలకు తీసుకెళ్లాలని, విలువల్ని చాటాలని అటవీశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నై డివిజన్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఓ పథకాన్ని తీసుకొస్తోంది. చారిత్రక ఆధారాలున్నవి, పురాతనమైన వృక్షాల్ని కాపాడాలని ‘వారసత్వ వృక్షం’ పేరుతో ప్రాజెక్టును తీర్చిదిద్దింది. మరికొన్నాళ్లలో చెన్నైలో అమల్లోకి తేనున్నారు. అనంతరం మరికొద్ది నెలల్లోనే ఇతర జిల్లాలకు ప్రాజెక్టును విస్తరించనున్నారు.
ప్రాథమికంగా 104..
అటవీశాఖ ఆధ్వర్యంలో ఇదివరకు వారసత్వ వృక్షాలపై సర్వే చేసేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు. నగరవ్యాప్తంగా తిరిగి పురాతన చెట్లు వివిధ ప్రాంతాల్లో 104 ఉన్నట్లుగా గుర్తించారు. వాటికి చరిత్రతో సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. చాలారకాల వృక్షజాతులు వారికి కనిపించాయి. కొన్ని పాఠశాలల ఆవరణాల్లో, మరికొన్ని ఆలయాల్లో, ఇంకొన్ని మైదానాల్లో, ఆపై వివిధ చారిత్రక నేపథ్యమున్న సంస్థల ఆవరణల్లోనూ ఉన్నట్లుగా గుర్తించారు.
ఎంపికకు ప్రత్యేక కమిటీ
నగరంలోని వృక్షశాస్త్ర నిపుణులతో పాటు అనుబంధ ఎన్జీవోలతో కలిసి నడిచేలా ప్రతిపాదనలు చేశారు. వారంతా, అధికారులు కమిటీగా ఏర్పడి పురాతనంగా ఉన్నవి, చారిత్రక నేపథ్యం, వారసత్వంగా వచ్చే వృక్షాల్ని ఎంపిక చేయనున్నారు. ఆయా వృక్షాల వయసు, పుస్తకాల్లో వాటికున్న ఆధారాలు, చెట్టుకున్న పర్యావరణ లక్షాలు, దానికి సంస్కృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ లోతైన నివేదిక ఇవ్వనున్నారు.
700 ఏళ్లకు మించే..
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రాజపాళయంలోని అత్యంత చారిత్రాత్మక వృక్షం ఒకటుంది. పేరు.. ఆఫ్రికన్ బావొబాబ్ ట్రీ. వయసు కనీసం 700 ఏళ్లు ఉంటుందని చరిత్రకారులు భావిస్తుంటారు. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే.. కాండం చుట్టూ 16 మందికిపైగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నిల్చునేంత విశాలంగా ఉంటుంది. ఎంతలేదన్నా చుట్టుకొలతే 57 అడుగులు. 78 అడుగులకు మించిన ఎత్తు వరకు పెరిగింది. అద్భుత వృక్షంగా చూస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్ని పర్యాటక ప్రాంతంగా మార్చి చెట్టు గురించి మరింతగా ప్రజలకు తెలపాలని అనుకుంటున్నారు.
సర్వాంగ సుందరంగా..
చెట్టు దగ్గర ఎక్కువసేపు గడిపి, దాని గురించి మరింత బాగా తెలుసుకునేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం చెట్టు పరిసరాల్లో వారు ఆహ్లాదంగా గడిపేందుకు ఏర్పాట్లు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. భారీ వృక్షాల సహజత్వాన్ని కాపాడటంతో పాటు సంస్కృతితో ఉన్న అనుబంధం, చారిత్రాక అంశాలు, దాని సౌందర్య విలువలు ఇలాంటివన్నీ ఆయా చెట్ల దగ్గర పర్యాటకుల కోసం ప్రదర్శించనున్నారు. ఆయా వృక్షాల వద్ద వివరంగా తెలిసేలా సూచికలు, బోర్డులు ఉంచనున్నారు.
ఆనందమంటే ఇదేకదా..
చెన్నై అడయారులోని థియోసొఫికల్ సొసైటీ ఆవరణలోని ‘ది గ్రేట్ బన్యన్ ట్రీ’ నగరానికే వన్నె తెచ్చేలా ఉంది. ఈ మర్రిచెట్టుకు 450 ఏళ్లకు మించిన వయసు ఉంటుందని భావిస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందు నుంచి నగరానికి వచ్చిన ఎంతోమంది ప్రముఖులు ఈ చెట్టును తప్పక వీక్షించేవారు. ఇప్పటికీ ఇక్కడికి పర్యాటకుల, పర్యావరణ ప్రేమికుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. పిల్లలు పెద్దలు ఈ చెట్టనీడన సంతోషంగా ఉండి వెళ్తున్నారు. ఇలాంటి వృక్షాలకు అదనపు హంగుల్ని అటవీశాఖ అధికారులు ఇవ్వనున్నారు.
దేశానికే స్ఫూర్తిగా నిలిచేలా..
పురాతన చెట్లే అసలైన అందం. అవి పర్యావరణానికి సాక్షిగా ఉన్నాయి. గత చరిత్రను గుర్తుచేస్తున్న వాటితో వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నాం. మా లక్ష్యం చారిత్రక వృక్షాల్ని కాపాడటమే కాదు, వాటి గురించి ప్రజల్లో అవగాహన తేవడం, పర్యావరణాన్ని ప్రేమించేవారిగా మార్చడంలాంటి విలువల్ని సమాజంలో పెంచాలని అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమంలో దేశంలోనే ముందుండాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం.-సుప్రియాసాహు, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి





