
బంగబంధు ముజిబుర్ రహ్మాన్, మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేసేలా బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దానిలో భాగంగా బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్‌క్ ఉన్న ‘ఫాదర్ ఆఫ్ నేషన్’ బిరుదును తొలగించింది. అలాగే స్వాతంత్ర్య సమరయోధులు అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఈ మేరకు నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కౌన్సిల్ యాక్ట్‌ను సవరించిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీ చేసిందని తెలిపాయి.
‘‘యూనస్ ప్రభుత్వం జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ పదాలు, చట్టంలో ఆయన పేరు ఉన్న భాగాలను తొలగించింది’’ అని ఓ మీడియా కథనం పేర్కొనింది. ఇటీవల ముజిబుర్ చిత్రం ఉన్న కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త డిజైన్‌తో కూడిన నోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దాని స్థానంలో హిందూ, బౌద్ధ ఆలయాల ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీ మొదలైంది. ‘‘కొత్త డిజైన్, సిరీస్ ప్రకారం.. కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు ఉండవు. వీటికి బదులుగా ప్రకృతి, ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయి’’ అని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
తూర్పు పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌గా పేరు మార్చుకున్న తర్వాత.. 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్‌ను ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమె తండ్రి ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. తాజాగా వాటిని రద్దుచేసి కొత్తవాటిని విడుదల చేశారు.
ఆ దేశ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్ రహ్మాన్ ప్రాధాన్యం తగ్గించేలా గతంలో సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. 1971 బంగ్లా విముక్తి పోరాటం సందర్భంగా స్వాతంత్ర్య ప్రకటన తొలిసారిగా జియావుర్ రహ్మాన్ చేసినట్లు మార్పులు చేశారు. గతంలో ఈ ప్రకటన షేక్ ముజిబుర్ రెహ్మాన్ చేసినట్లు ఉండేది. ఈ పరిణామాలపై గతంలో నేషనల్ కరికులమ్ టెక్స్ట్ బుక్ బోర్డ్ ప్రొఫెసర్ ఏకేఎం రియాజుల్ హుస్సేన్ స్పందిస్తూ.. కొత్త పుస్తకాలను 2025 కోసం సిద్ధం చేశామని చెప్పారు. 1971 మార్చి 26న జియావుర్ రహ్మాన్ స్వాతంత్ర్య ప్రకటన చేశారని.. మార్చి 27న ఆయనే బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ తరఫున కూడా ఇలాంటి ప్రకటనే వెలువరించినట్లు మార్చారన్నారు. ఉచిత టెక్స్ట్‌బుక్స్‌లో ఈ విషయాన్ని పొందుపర్చినట్లు చెప్పారు.
అవామీ లీగ్ మద్దతుదారులు మాత్రం ముజిబుర్ రహ్మాన్ నాటి మేజర్ జియావుర్ రహ్మాన్‌తో కలిసి ఈ ప్రకటన చేసినట్లు బలంగా నమ్ముతారు. ముజిబ్ ఆదేశాల మేరకు జియావుర్ ప్రకటన చదివినట్లు చెబుతారు. కానీ, బీఎన్‌పీ పార్టీ మాత్రం జియావుర్ స్వయంగా ఈ ప్రకటన చేసినట్లు చెబుతుంది.





