News

పాక్‌కు ఎప్పుడూ ఎదురుదెబ్బలే : తమ పరాభవాలు బయటపెట్టిన బిలావల్‌ భుట్టో

275views

అంతర్జాతీయ వేదికలపై తమ దేశానికి తగిలిన ఎదురుదెబ్బల గురించి స్వయంగా పాక్‌ నేత బిలావల్‌ భుట్టో వెల్లడించారు. కశ్మీర్ అంశాన్ని ఐరాసలో లేవనెత్తేందుకు చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కలేదని వాపోయారు. ఆపరేషన్‌ సిందూర్‌పై ఏర్పాటైన భారత అఖిలపక్షం తరహాలో పాక్‌ కూడా తన విదేశాంగశాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఓ ఎంపీల బృందాన్ని ఏర్పాటుచేసింది. వీరిని అమెరికా పంపగా, ఆ పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని ఐరాస కేంద్ర కార్యాలయంలో భుట్టో మాట్లాడారు.

‘‘కశ్మీర్‌ అంశానికి సంబంధించినంతవరకు మనం ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పటికీ ఉన్నాయి. దీంతోపాటు ఇతర వేదికలపై ఎదురుదెబ్బలు తగిలాయి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘రెండు అణ్వస్త్ర దేశాల మధ్య వివాదాల పరిష్కార వ్యవస్థను తీసుకురావడం అసాధ్యం. మా రెండు దేశాలకు చెందిన నిఘాసంస్థలు ఐఎస్‌ఐ, రా.. కలిసి కూర్చొని, ఈ ఉగ్రవాద శక్తులపై పోరాటం కోసం కలిసి పనిచేస్తే, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గిపోతాయని నేను భావిస్తున్నాను’’ అని మాట్లాడారు. రెండు దేశాల మధ్య నిరంతర ఘర్షణ విద్రోహశక్తులను బలోపేతం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేయడం గమనార్హం. నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోసే ఆ దేశం నీతులు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గతంలోనూ తన దేశం గురించి ఆయన వాస్తవాలు బయటపెట్టారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమేనంటూ ఇటీవల వెల్లడించారు. ‘‘పాకిస్థాన్‌కు గతం ఉందనేది రహస్యం కాదని నేను భావిస్తున్నా. ఫలితంగా మనం బాధపడ్డాం. పాకిస్థాన్ నష్టపోయింది. ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈ సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం. పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే, అది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగం’’ అని స్థానిక మీడియాతో భుట్టో వెల్లడించారు.