News

వియత్నాం నుంచి తిరిగి వచ్చిన బుద్ధుడి పవిత్ర అవశేషాలు

189views

వియత్నాం ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మంగళవారం తిరిగి దిల్లీకి తీసుకొచ్చి నేషనల్‌ మ్యూజియంకు అప్పగించింది. గతంలో నాగార్జున కొండ నుంచి వెలికితీసిన ఈ అవశేషాలను సారనాథ్‌లో సంరక్షిస్తూ వస్తున్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కోరిక మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ వీటిని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకమంత్రి కందుల దుర్గేష్‌లతో కూడిన బృందంతో మే 1న వియత్నాంలోని హోచిమిన్‌ నగరానికి పంపింది. ఆ దేశంలోని 9 నగరాల్లో వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నెలరోజుల్లో వాటిని సుమారు 1.78 కోట్ల మంది సందర్శించినట్లు కంభంపాటి హరిబాబు విలేకర్లకు చెప్పారు. అక్కడి మీసన్‌ అనే నగరంలో చోళుల కాలంలో నిర్మించిన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని భారత పురావస్తు శాఖ చేపడుతోందని తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను భారత ప్రభుత్వమే సమకూరుస్తోందని వెల్లడించారు. మహాపర్వత్‌గా పిలిచే ప్రాంతంలో ఉన్న ఆ ఆలయంలో శివలింగం, నంది ఉన్నాయని చెప్పారు. ఛామ్‌ అనే తెగ వారు ఇప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తుంటారని వివరించారు. ప్రతిరోజూ మూడుసార్లు శివతాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారని హరిబాబు తెలిపారు. ప్రస్తుతం తాము దిల్లీలోని నేషనల్‌ మ్యూజియంకు అప్పగించిన బుద్ధుడి అవశేషాలను తిరిగి సారనాథ్‌లో భద్రపరుస్తారని చెప్పారు.