News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు ఉద్యమిస్తాం!

248views

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ స్పష్టం చేశారు. గోవులను వధించడాన్ని నిరోధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం గో రక్షకులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ‘గో మహాధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వేల సంఖ్యలో గోవులను ఇప్పటికే పాతబస్తీకి తరలించారన్నారు. వాటిని విడిపించడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలుచేయాలని కోరారు. గో రక్షకులపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గోవధకు నిరసనగా ఈ నెల 7ను బ్లాక్‌ డేగా పాటిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర గోశాల సమాఖ్య అధ్యక్షుడు విజయరామ్, ఆర్‌ఎస్‌ఎస్‌ గోసేవ విభాగం అధ్యక్షుడు రామారావు, అఖిల భారత గోసేవ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి, భారత్‌ ప్రాణిమిత్ర సంఘ్‌ అధ్యక్షుడు జసరాజ్, లవ్‌ ఫర్‌ కౌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు జస్మత్‌పటేల్, శంకర విద్యాభారతి గో ఫౌండేషన్‌ అధ్యక్షుడు కుప్పా శ్రీనివాస్, కరాటే కల్యాణి, శివపార్వతి మాతాజీ, నాగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.