News

గోవధ నిషేధ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ

252views

దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. అక్రమంగా నిర్బంధించిన గోవులను విడిపించి గోశాలలకు తరలించేందుకు సోమవారం వీహెచ్‌పీ చేపట్టిన ‘ఆపరేషన్‌ గోమాత..చలో పాతబస్తీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ గోమాత కార్యక్రమంలో వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, గోరక్ష విభాగ్‌ ప్రాంత ప్రముఖ్‌ రమేశ్‌జీ, బజరంగ్‌దళ్‌ పూర్వ అధ్యక్షుడు సుభాష్‌ చందర్, అఖిల భారత గోశాల ఫౌండేషన్‌ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి, తెలంగాణ గోశాలల అధ్యక్షులు విజయరామ్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో గోవధ జరుగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్‌పోస్టులను దాటుకుని నగరానికి గోవులు ఎలా చేరుకున్నాయని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సుల్తాన్‌బజార్‌ ఎస్సై మధుసూదన్‌ ఫిర్యాదు మేరకు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై వీహెచ్‌పీ ప్రతినిధులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ నరసింహా పేర్కొన్నారు.