News

సనాతన ధర్మాన్ని వెక్కిరించిన టీఎంసీ ఎంపీలపై చర్యలు ఎందుకు లేవు?

284views

‘ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ ఆ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు అక్కడి పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో అక్కడ టీఎంసీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘శర్మిష్ఠ వ్యాఖ్యలు ఎందరినో బాధించాయి. మనోభావాలు దెబ్బతీశాయి. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని సామాజిక మాధ్యమాల నుంచి వీడియోను తొలగించి క్షమాపణ చెప్పారు. టీఎంసీల నాయకులు సనాతన ధర్మాన్ని వెక్కిరించి, లక్షల మందిని బాధించినా వారు క్షమాపణలు చెప్పలేదు. అక్కడి పోలీసులు ఎందుకు గట్టి చర్యలు తీసుకోలేదు? దైవదూషణను ఎప్పుడూ ఖండించాల్సిందే. సెక్యులరిజం అనేది ఒకరికి రక్షణ కవచంగా, మరొకరికి కత్తిలా ఉండకూడదు. పశ్చిమబెంగాల్‌ పోలీసుల తీరును దేశం గమనిస్తోంది. అందరికీ ఒకే న్యాయం ఉండేలా వ్యవహరించాలి’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.