News

మేల్కొనేలోపే మెరుపుదాడి చేసింది

177views

భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా చేసిన వైమానిక దాడులకు దీటుగా స్పందించేలోపే భారత్‌ మళ్లీ క్షిపణులతో విరుచుకుపడుతుందని తాము ఊహించలేదని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. అజర్‌బైజాన్‌ దేశంలో పర్యటిస్తున్న షెహబాజ్‌ లాచిన్‌ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఆపరేషన్‌ సిందూర్‌ సంగతులను అందరితో పంచుకున్నారు.

‘‘ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ చేసిన దాడులకు స్పందనగా ప్రతీకార దాడులతో తెగబడాలని నిర్ణయించాం. మే 9వ తేదీ అర్ధరాత్రి దాటాక ఇందుకు ప్రణాళిక సిద్ధంచేశాం. తెల్లవారు జామున 4.30 గంటలకు ఫజర్‌ ప్రార్థనల తర్వాత దాడి చేయాలని భావించాం. కానీ ఆలోపే భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షం కురిపించింది. వేర్వేరు ప్రావిన్సుల్లోని వైమానిక స్థావరాలపై క్షిపణిదాడులు జరిగాయి.

రావల్పిండిలోని ఎయిర్‌పోర్ట్‌ సైతం దాడులకు ధ్వంసమైంది’’ అని షెహబాజ్‌ చెప్పారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ ఎదుటే ఈ దాడుల అంశాన్ని షెహబాజ్‌ ప్రస్తావించడం గమనార్హం. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ వైమానిక స్థావరం మీదా భారత్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ స్థావరం పాకిస్తాన్‌ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ అత్యంత అధునాతన లాక్‌హీడ్‌ సీ–130 హెర్క్యులస్, ల్యూషిన్‌ ఐఐ–78 ఇంధనం నింపే విమానాలు ఉన్నాయి.